బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన తాజాగా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వయంగా కంగనా తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రకటన రోజు నుంచే బాలీవుడ్ లో సంచలనం రేకెత్తించింది. ఈ చిత్రంలో కంగనా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను ఇందులో చూపించారు.
నిజంగా ఇందిరా ఆ వ్యాఖ్యలు చేశారా?
ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్ 25, 1975లో టీజర్ మొదలవుతుంది. విపక్ష నాయకుల అరెస్టులు, మీడియా ప్రసారాలపై ఆంక్షలు, ప్రజల ఆందోళన, పోలీసుల అణిచివేత టీజర్ లో హైలెట్ అయ్యాయి. ఇక ఇందులో ఇందిరా పాత్ర ధారిలో ఉన్న కంగనా, ‘ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా’ అనే వాయిస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ వ్యాఖ్యలు ఇందిరా ఎప్పుడూ చేయలేదు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన.
‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అని చెప్పింది ఎవరు?
‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిర ఈజ్ ఇండియా’ అనే ప్రకటన ముమ్మాటికీ వాస్తవం. కానీ, ఈ మాట అన్నది అప్పుడు ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ కాదు. వీటిని 1974లో అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న డికె బారువా చెప్పారు. ప్రధానమంత్రి పట్ల బరూవాకు విపరీతమైన గౌరవం ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇందిరా మీద విధేయతను చూపించడానికి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, ఎమర్జెన్సీ తర్వాత బారువా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి వేరే పార్టీని పెట్టుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ మద్దతుదారులు ‘ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా’ అనే మాటలను దేశానికి ఆమె అవసరానికి గుర్తుగా ఉపయోగించారు. కానీ, ప్రధాని స్వయంగా ఎప్పుడూ చెప్పలేదు. కనీసం రికార్డులో కూడా లేదు.
Also Read : సమంత సెలెక్షన్ సూపర్, చైతూ మర్యాదస్తుడు - మాజీ కపుల్‌పై శోభిత కామెంట్స్
నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
‘ఎమర్జెన్సీ చిత్రాన్ని మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి తో కలిసి కంగనా రనౌత్ నిర్మించారు. ఈ సినిమాలో జెపిగా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయిగా శ్రేయాస్ తల్పాడే, పుపుల్ జైకర్‌గా మహిమా చౌదరి, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షాగా మిలింద్ సోమన్, సంజయ్ గాంధీగా విశాక్ నాయర్, జగ్జీవన్ రామ్‌గా సతీస్ కౌశిక్ నటించారు. ఈ సినిమా నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. నిజానికి ముందు అక్టోబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో నవంబర్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ ఏడాది బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో 'ఎమర్జెన్సీ' కూడా ఒకటి. కంగనా రనౌత్ ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం కూడా వహించారు. రితేష్ షా ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు.
Read Also: భాగమతి దర్శకుడి కొత్త సినిమా - 'ఛూమంతర్ కాళీ'తో పాన్ ఇండియా టార్గెట్ చేసిన హవీష్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial