కుల వివక్ష ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉందని అప్పుడప్పుడూ వార్తల్లో వచ్చే కొన్ని ఘటనలు చూస్తే అర్థం అవుతూ ఉంటుంది. ఒక 35 ఏళ్ళు వెనక్కి వెళితే కులాల గొడవలు ఎక్కువ ఉండేవి. కుల వివక్ష, కాలేజీ నేపథ్యంలో సీతారాములు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కథతో రూపొందిన సినిమా 'కౌసల్య తనయ రాఘవ'. 

కలియుగంలో సీత ప్రేమలో రాముడు పడితే?అమ్మాయితో మాట్లడొద్దని పంచాయితీ ఆదేశిస్తే?పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన స్వచ్ఛమైన, వింటేజ్ లవ్ ఎమోషనల్ డ్రామా 'కౌసల్య తనయ రాఘవ'. రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా ఏఆర్ మూవీ మేకర్స్ పతాకంపై అడపా రత్నాకర్ నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి స్వామి పట్నాయక్ కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. 

'కౌసల్య తనయ రాఘవ' టీజర్, సాంగ్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల చేయగా... అందులో హీరో హీరోయిన్లతో పాటు వాళ్లిద్దరూ ప్రేమలో పడటంతో పాటు ఇద్దరి మధ్య దూరం ఏర్పడటానికి గల కారణం కూడా వివరించారు. ట్రైలర్ చూస్తే హీరోది తక్కువ కులం అని అర్థం అవుతోంది. అతను ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెది పెద్ద కులం. కాలేజీలో హీరో అంటే పడని కొందరు అమ్మాయి తండ్రి దగ్గరకు వెళ్లి తక్కువ కులం వాడితో ప్రేమలో పడిందని చెబుతారు. అమ్మాయితో మాట్లాడొద్దని హీరోని ఊరి పంచాయతీ ఆదేశిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. సీతారాములు, రావణుడు స్పూర్తితో సినిమా తెరకెక్కించారని అర్థం అవుతోంది. 'కౌసల్య తనయ రాఘవ' ట్రైలర్‌ చూస్తే... ఆ విజువల్స్, మ్యూజిక్ అప్పటి వాతావరణం క్రియేట్ చేయడంలో హెల్ప్ అయ్యాయి.

Also Readమంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?

'కౌసల్య తనయ రాఘవ'లో తానొక ముఖ్యమైన పాత్ర చేసినట్టు నటుడు ఆర్కే నాయుడు తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ''ట్రైలర్‌ అద్భుతంగా కట్ చేశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. తనను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు హీరో రాజేష్ థాంక్స్ చెప్పారు. 'కౌసల్య తనయ రాఘవ' అద్భుతంగా వచ్చిందని, ఏప్రిల్ 11న థియేటర్లలో సినిమా చూసి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. నిర్మాత రత్నాకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారని... రాజేష్, శ్రావణి, ఆర్కే నాయుడు అద్భుతంగా నటించారని దర్శకుడు స్వామి పట్నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి మనీషా, నటులు లోహిత్, చంటి, కెమెరామెన్ యోగి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్, మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు తదితరులు పాల్గొన్నారు.

Also Readఅలేఖ్య చిట్టి పర్సనల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఏమైంది? చెల్లెలు రమ్య మోక్ష అకౌంట్‌లో ఎందుకు వీడియో పోస్ట్‌ చేశారు?