ఒకసారి జరిగితే పొరపాటు...రెండోసారి జరిగితే గ్రహపాటు...మూడోసారి జరిగితే అలవాటు...నాలుగోసారి, ఐదోసారి, మరోసారి?ఆడ - మగ అని తేడా లేకుండా అందరినీ బూతులు తిడితే?
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్ళాలని మద్దతు ఇచ్చే మగవాళ్ల సైతం మౌనంగా ముక్కున వేలేసుకునేలా కస్టమర్లపై అలేఖ్య చిట్టి బూతులతో విరుచుకుపడ్డారు. 'పాపం ఏ పరిస్థితుల్లో ఆవిడ ఉందో? ఎందుకు ఆ విధంగా తిట్టాల్సి వచ్చిందో? ఒక్కరినే కదా తిట్టింది!' అనుకునే లోపు... రెండు, మూడు, నాలుగు అంటూ ఆడియో లీక్స్ వచ్చాయి. దాంతో అలేఖ్య చిట్టి (Alekhya Chitti) గురించి ఏమనుకోవాలి? అనే చర్చ మొదలైంది.
అలేఖ్య బూతులకు బాధితులుగా నిలిచిన కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువ ఉందని సమాచారం. సోషల్ మీడియాను వాడుకుని తమ వ్యాపారాన్ని విస్తరించిన 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ వ్యవహార శైలి ముందు నుంచి వివాదాస్పదం అని వాళ్ళను గమనిస్తున్న నెటిజన్స్ కొందరు చెబుతున్న మాట.
అలేఖ్యపై ఎందుకింత వ్యతిరేకత...ఆడియో లీక్స్‌కు ముందు జరిగిందేమిటి?'అలేఖ్య చిట్టి పికిల్స్'కు ఇంతటి పాపులారిటీ రావడానికి కారణం ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అలేఖ్య చిట్టి ఒక్కరే కాదు... ఆవిడకు అండగా అక్క సుమ కంచర్ల, చెల్లెలు రమ్య మోక్ష కంచర్ల (రమ్య గోపాలకృష్ణ) ఉన్నారు.
సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో రమ్య మోక్ష రీల్స్ చేస్తుంటారు. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ స్టైల్ గురించి కొంత మంది విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. పికిల్స్ ప్రమోట్ చేసే వీడియోలలో కూడా సిస్టర్స్ డ్రెస్ గురించి కామెంట్ చేసిన జనాలు ఉన్నారు. తమను విమర్శించిన వ్యక్తులకు ఘాటుగా ధీటుగా అలేఖ్య జవాబులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. అయితే, అప్పట్లో వాళ్లకు కొంతమంది నెటిజన్స్ నుంచి మద్దతు లభించింది.
సాధారణంగా మోడ్రన్ డ్రెస్సింగ్ గాళ్స్ మీద సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కామెంట్స్ చేస్తుంటారు. అటువంటి వాళ్లకు రిప్లై ఇచ్చే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. 'డ్రెస్ ఎందుకు చూస్తున్నారు? పికెల్స్ ఇష్టమైతే కొనండి? లేదంటే మానేయండి!' అని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. అలేఖ్య సిస్టర్స్ ముగ్గురికీ ఆ విధంగా మద్దతు లభించింది. అయితే... ఇప్పుడీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడానికి కారణం మాత్రమే అలేఖ్య బూతులే. అందులో మరో సందేహం అసలు అవసరం లేదు.
అలేఖ్యపై ఎందుకింత ద్వేషం అంటే...బూతులు తిట్టడం ముమ్మాటికీ తప్పే కానీ!సోషల్ మీడియాలో ఆడపిల్లలను టార్గెట్ చేస్తున్నారని కొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆడ పిల్లలు కాబట్టి వదిలేయాలని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే... అందులో ఆడ, మగ తేడాలు ఎందుకు చూడాలి? ఆ యాంగిల్‌లో ఎందుకు చూస్తున్నారు? ఒకవేళ ఎవరైనా మగాడు అలా బూతులు తిడితే సో కాల్డ్ అభ్యుదయవాదులు ఊరుకుంటారా? కోపంలో తిట్టేశారని సర్ది చెప్పి ఆ సమస్యను అక్కడితో వదిలేస్తారా? సోషల్ మీడియాలో అలేఖ్య సిస్టర్స్ ఫోటోలు, వీడియోల కింద కామెంట్ చేసినోళ్లది ఎంత తప్పో, ఆవిడ చేసింది కూడా అంతే తప్పు.
అలేఖ్యపై తీవ్రమైన ద్వేషం వెళ్లగక్కడానికి మొదటి కారణం ఆవిడ తన నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం. రెండో కారణం... అక్క చెల్లెళ్లు డిఫెండ్ చేస్తూ వీడియోలు విడుదల చేయడం! కస్టమర్‌ను అలేఖ్య బూతులు తిట్టిన ఆడియో వైరల్ అయ్యాక సుమ కంచర్ల మొదట స్పందించారు. తన చెల్లి చేసింది తప్పేనని అన్నారు. కానీ, వన్ సైడ్ వెర్షన్ విని నిందించడం తగదని చెప్పుకొచ్చారు. ట్రోలింగ్ వల్ల తన చెల్లెలు డిప్రెషన్‌లోకి వెళ్లిందని, తన చెల్లి తిట్టిందని తమను తిట్టేవాళ్లకు చిన్నపాటి క్లాస్ కూడా పీకారు. తమను తిట్టే జనాలకు 'అప్పుడు తేడా ఏముంటుంది?' అని ప్రశ్నించారు.
సుమ కంచర్ల వీడియో విడుదల అయ్యాక మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. బండ బూతులు తిట్టిన ఆవిడ డిప్రెషన్‌లోకి వెళితే తిట్లు తిన్న వ్యక్తి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత రెండో ఆడియో లీక్ అయ్యింది. అప్పుడు రమ్య మోక్ష వీడియో విడుదల చేశారు. తన అక్కది తప్పేనని చెబుతూ... తమను బూతులు తిట్టిన వాళ్లను మాత్రమే తిట్టామని, పొరపాటున ఒకరికి సెండ్ చేయబోయి మరో కస్టమర్‌కు అక్క రిప్లై (బూతులు తిడుతూ) ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తమకు మిడ్ నైట్ ఆడియో, వీడియో కాల్స్ చేస్తారని... తమను వేధిస్తున్న జనాలు చాలా మంది ఉన్నారని... తండ్రి మరణం తర్వాత తాము ఎవరి అండదండ లేకుండా వ్యాపారం చేస్తున్నామని రమ్య తెలిపారు. ఆవిడ సింపతీ కార్డు ప్లే చేస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి.
ఎన్ని ఆడియోస్ లీక్ చేసినా తాము చెప్పేది ఒక్కటేనని, బూతులు తిట్టినోళ్లను మాత్రమే తన అక్క తిట్టిందని రమ్య చెప్పడం మంట మీద పెట్రోల్ పోసినట్టు అయ్యింది. జస్ట్ పికిల్స్ రేటు ఎక్కువ అని అడిగిన పాపానికి అలేఖ్య బూతులతో విరుచుకుపడిన మరో రెండు ఆడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. అలేఖ్య బూతులను ఎక్స్‌పోజ్ చేస్తున్న మీమర్స్, ట్రోలర్స్ దగ్గరకు బాధితులు వెళ్లారు. అంటే... తమ వాట్సాప్ చాట్స్ సెండ్ చేయడం మొదలు పెట్టారు. రమ్య వీడియోలో ఓ కస్టమర్ వాళ్లను తిడుతూ చేసిన ఓ మెసేజ్ ఉంది. అయితే... కస్టమర్లను అలేఖ్య తిట్టిన చాట్స్ ఐదారు బయటకు వచ్చాయి. అదీ పికిల్స్ రేట్ ఎక్కువ అని అడిగిన పాపానికి తిట్లు తిన్నారు.
అలేఖ్య చిట్టి బూతులకు బాధితులుగా నిలిచిన జనాలు ఒక్కొక్కరూ బయటకు వస్తుండటంతో పరిస్థితిలో తీవ్రత సిస్టర్స్ ముగ్గురికీ అర్థం అయినట్టు ఉంది. ఏ కండిషన్స్ పెట్టకుండా, ఎటువంటి వివరణలు ఇవ్వకుండా అలేఖ్య చిట్టి బేషరతు క్షమాపణలు చెప్పారు. 'తప్పు చేశాను... తిట్టినోళ్లు అందరికీ సారీ' అని చెప్పారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఆవిడ డిలీట్ చేశారు. అలేఖ్య సారీ చెప్పిన తర్వాత సుమ మరోసారి వీడియో చేశారు సుమ కంచర్ల. తమను ట్రోల్ చేసిన తర్వాత అలేఖ్య చేత తిట్లు తిన్న కుటుంబాలు ఏ స్థాయిలో బాధ పడ్డాయో అర్థం చేసుకోగలమని వాళ్లకు సారీ చెప్పారు ఆవిడ. నాలుగు రోజులు జరిగిన ట్రోలింగ్ అలేఖ్య జీవితంలో మాయని మచ్చగా మిగులుతుందని, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టమని సుమ రిక్వెస్ట్ చేశారు.
నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని ఓ సామెత ఉంది. అలేఖ్య చిట్టి విషయం గమనిస్తే అది గుర్తుకు వస్తుంది. వివాదం మొత్తంలో ఓ విషయం గమనించారా? మగాడిని తిట్టడానికి మహిళలు సైతం మరో మహిళను తక్కువ చేయక తప్పదా? 'నీ అమ్మను...' అని అలేఖ్య చిట్టి తిట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఒక్క విషయం అర్థం కాలేదు... ఆమె ఎవరిని తిట్టింది? ఒకవేళ రమ్య మోక్ష చెప్పినట్టు అసభ్యకరమైన సందేశాలు పంపిన వాళ్లను అనుకున్నా... అటువంటి మగాళ్లను తిట్టడంలో మరో మహిళను ఆవిడ తక్కువ చేసింది. ఇంతా చేసి మహిళల నుంచి మద్దతు కోరుకోవడం ఏమిటో? ఈ వివాదంలో ఆవిడకు మద్దతు ఇచ్చే మహిళలు సైతం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి. తప్పు చేసినది మహిళ అయితే ఒక విధంగా, మగాడు అయితే మరో విధంగా స్పందించకూడదు. అందరికీ ఒకటే రియాక్షన్ (చట్టం) ఉంటే బావుంటుంది.