హీరోల పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు చేసే పనులు కొన్నిసార్లు వాళ్ల ప్రాణాలకే ప్రమాదంగా మారుతూ ఉంటుంది. ఇప్పటికే కొందరు అభిమానులు తమ హీరో పై అభిమానాన్ని చాటుకునేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనల్ని మనం చూసాం. తాజాగా మరోసారి ఓ స్టార్ హీరో అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ప్రముఖ తమిళ హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో తాజాగా ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఇక ఆ యువకుల మృతికి సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని మోపు వారి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సూర్య పుట్టినరోజు సందర్భంగా అతని ముగ్గురు అభిమానులు ఆదివారం తెల్లవారుజామున ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న కరెంటు స్తంభం నుంచి షాక్ కొట్టింది. ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ కావడంతో ఆ ఫ్లెక్సీ కి పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో వెంకటేష్, సాయి అనే ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు సాయి, వెంకటేష్ ఇద్దరూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకుని చలించిపోయిన సూర్య తాజాగా మృతుల కుటుంబాలను వీడియో కాల్ లో పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మృతుల్లో ఒకరి సోదరి తను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించమని కోరగా.. సూర్య తప్పకుండా తన బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగం తో పాటు వారి కుటుంబాలకి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని చెప్పి వారిలో ధైర్యాన్ని నింపారు.
కాగా ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యు వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లిమ్స్ లో విజువల్స్, సూర్య గెటప్, దేవిశ్రీప్రసాద్ బిజిఎం ఓ రేంజ్ లో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశాపటాని హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలో సూర్య ఐదు విభిన్న తరహా పాత్రలో కనిపించినట్లు సమాచారం. సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2024 ప్రథమార్థంలో విడుదల చేయనున్నారు.
Also Read : రణ్‌వీర్, ఆలియా మూవీలో మమతా బెనర్జీపై వ్యాఖ్యలు, చెత్త డైలాగ్స్‌పై సెన్సార్ వేటు!