కోలీవుడ్ అగ్ర హీరో విశాల్ తాజాగా ఓ సెన్సార్ అధికారి లంచగొండితనం గురించి సంచలన ఆరోపణలు చేశాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) ఆఫీస్ లో తనకు స్వయంగా ఈ అనుభవం ఎదురయిందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఓ సుదీర్ఘ ట్వీట్ చేస్తూ ఒక వీడియో సైతం రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే పీఎం ప్రధాన మోడీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తాజా వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


"వెండితెరపై కూడా అవినీతి చూపిస్తున్నారు. దీనిని అసలు జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీ బీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) ఆఫీస్ లో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ  హిందీ వెర్షన్ రిలీజ్ కోసం రూ.6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి నేనే స్వయంగా రెండు లావాదేవీలు చేశాను. ఒకటి మొదట స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు రెండు సర్టిఫికేషన్ కోసం రూ.3.5 లక్షలు చెల్లించాను. నా సినీ కెరీర్లో ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. నా సినిమాని ఎలాగైనా నార్త్ లో రిలీజ్ చేయాలని అనుకున్న నాకు ఈ పరిస్థితి ఎదురవడంతో డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు" అని అన్నారు.






"ఈరోజు విడుదలైన సినిమా నుంచి చాలా ఎక్కువ వాటా నా పేరున ఉన్నందున సంబంధిత మధ్యవర్తికి డబ్బు చెల్లించడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఇలా చేస్తుంది నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశం లేదు. ఆ అవినీతిని అందరూ చూడ్డానికి సాక్ష్యం కూడా ఇస్తున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ ట్వీట్స్ తో పాటు వీడియో సైతం నెట్టింట వైరల్ గా మారింది.


ఇక 'మార్క్ అంటోనీ' విషయానికి వస్తే.. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందింది. విశాల్, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 విడుదలై తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ జె సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ వంటి ప్రధాన తారాగణం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో విశాల్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకున్నాడు. మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత అందించారు. ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేసేందుకే మూవీ టీం సెన్సార్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ కి పంపించగా సర్టిఫికెట్ కోసం సెన్సార్ వాళ్లు 6.5లక్షలు లంచం తీసుకున్నట్లు విశాల్ వెల్లడించడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే చర్చనీయాంశంగా మారింది.


Also Read : వామ్మో లేడీ సూపర్ స్టార్, 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ అంత తీసుకుంటుందా?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial