Kollywood Actor Daniel Balaji Death: కోలీవుడ్ యాక్టర్ డేనియల్ బాలాజీ(48) కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి వేళ గుండెపోటుతో చనిపోయారు. పడుకున్నాక ఆయనకు ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మార్గ మధ్యలోనే ఆయన చనిపోయిట్లు వైద్యులు వెల్లడించారు. డేనియల్ మృతితో తమిళ సినిమా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికిలోనయ్యారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటుగా అభివర్ణించారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సినీ అభిమానులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇవాళ(శనివారం) చెన్నైలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు


డేనియ‌ల్ బాలాజీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేశారు. తమిళం, తెలుగు, మలయాళంతో పాటు కన్నడలోనూ నటించారు. సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించారు. ఎక్కువగా నెగెటివ్ రోల్స్ పోషించారు. చక్కటి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆయన పలు చిత్రాల్లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘సాంబ’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టారు. అనంతరం వెంక‌టేష్ ‘ఘ‌ర్ష‌ణ’ మూవీలో కనిపించారు. రామ్‌ చ‌ర‌ణ్ మూవీ ‘చిరుత‌’తో పాటు నాగ‌చైత‌న్య ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ సినిమాల్లో డిఫరెంట్ పాత్రలతో ఆకట్టుకున్నారు. 2021లో నాని హీరోగా తెరకెక్కిన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ చిత్రంలో విలన్ గా చేశారు. అతడు తెలుగులో నటించిన చివరి సినిమా ఇదే. తెలుగులో ఆయన నటించిన అన్ని సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పడం విశేషం.


‘చిట్టి’ సీరియల్ తో కెరీర్ ప్రారంభం


డేనియల్ బాలాజీ ‘చిట్టి’ అనే త‌మిళ సీరియ‌ల్‌ తో కెరీర్ మొదలు పెట్టారు. అదే సీరియల్ తెలుగులో ‘పిన్ని’ పేరుతో తెలుగులో డ‌బ్ అయ్యింది. తెలుగులోనూ ఆ సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలు పోషించారు.  కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ‘వెట్టైయాడు విలయాడు’ చిత్రంలో సైకోగా కనిపించి భయపెట్టారు. ఈ సినిమా తెలుగులో ‘రాఘవన్’ పేరుతో డబ్ అయి విడుదల అయ్యింది. ఇక్కడ కూడా ఈ చిత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత డేనియల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అనంతరం ‘పొల్ల‌వ‌ద‌న్‌’, ‘జ్ఞాన‌కిరుక్క‌న్‌’, ‘అచ్చం యెన్‌బ‌దు మద‌మైయదా’, ‘వ‌డాచెన్నై’, ‘బిగిల్‌’ సహా పలు సినిమాల్లో కనిపించారు. చాలా వరకు నెగెటివ్ పాత్రల్లోనే నటించారు. అటు మ‌ల‌యాళంలోనూ పలు సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. డేనియల్ చివరగా ‘అరియవాన్’ అనే సినిమాలో నటించారు.






Read Also: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌