'కోబలి' (Kobali Telugu Movie) టైటిల్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రాయలసీమ నేపథ్యంలో మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు. దానికి 'కోబలి' టైటిల్ అనుకున్నారు. అయితే, ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈ లోపు ఆ టైటిల్ తో ఓ చిన్న సినిమా మొదలైంది. 


బాబు మోహన్ క్లాప్... 
రెండు సినిమాలు స్టార్ట్
మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ (REDDY's Multiplex Movies Pvt Ltd) సంస్థ నిర్మిస్తున్న సినిమా 'కోబలి'. ఇందులో మిత్ర ప్రధాన పాత్ర పోషించనున్నారు. 


'కోబలి' పాటు నూతన దర్శకుడు ప్రసాద్, ఎనిమిది మంది హీరోయిన్లతో రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ప్రొడక్షన్ నెం 1గా తెరకెక్కిస్తున్న 'సోషల్ వర్కర్స్' (Social Workers Movie) సినిమాను సైతం సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. 'హ్యాపీ ఉమెన్స్ డే' (Happy Women's Day Movie) అని మరో సినిమాను అనౌన్స్ చేశారు.  పూజ అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ ఇచ్చారు.


'సోషల్ వర్కర్స్'లో నేనూ నటిస్తున్నా! - బాబు మోహన్
సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబు మోహన్, 'సోషల్ వర్కర్స్' సినిమాలో తాను కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ '''సినిమా పూజకు మొదట నన్ను పిలిచారు. ఆ తర్వాత ముందు నుంచి ఇందులో ఓ కీలక పాత్రకు నన్ను అనుకున్నారని చెప్పారు. మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చంటి చెప్పడంతో ఓకే చేశా. ఆ విధంగా ఈ సినిమాలో నేనూ ఓ భాగమయ్యా. 'అరుంధతి' తరహాలో 'కోబలి' తీస్తున్నామని చెప్పారు. ముంబై కేంద్రంగా స్థాపించిన రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థలో 20 సినిమాలు తీయాలని విజయ్ రెడ్డి ప్లాన్ చేశారట. ఆయనకు విజయాలు రావాలి'' అని చెప్పారు.


Also Read : రాముడి సెట్‌లోకి రావణ్ ఎంట్రీ - ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్


''ముంబైతో పాటు చెన్నై, హైదరాబాద్, విశాఖలో మాకు ఆఫీసులు ఉన్నాయి. కొత్త, ఔత్సాహిక దర్శక, రచయితలను, నటీనటులను పరిచయం చేస్తూ... మొత్తం 20 సినిమాలు నిర్మించాలని దీర్ఘకాలిక ప్రణాళికతో పరిశ్రమలో అడుగు పెట్టాం. మేం విశాఖలో రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేశాం. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాం. 'సోషల్ వర్కర్స్'కు వస్తే... సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ఉంటుంది. ఇక్కడ మహిళలకు ఎదురవుతున్న కష్టాల గురించి చెబుతాం. 'కోబలి' హారర్ నేపథ్యంలో సాగే యూత్ సినిమా'' అని రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ అధినేత విజయ్ రెడ్డి తెలిపారు. 


దైవ శక్తి, క్షుద్ర శక్తి మధ్య యుద్ధమే 'కోబలి'  
'దైవ శక్తికి , క్షుద్ర శక్తి మధ్య జరిగే యుద్ధమే 'కోబలి' కథాంశమని చిత్ర దర్శకుడు మహేందర్ రెడ్డి వివరించారు. మే లేదా జూన్ నెలలో తూర్పు గోదావరి జిల్లాలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, సినిమాలో నటించే తారలు పాల్గొన్నారు.


Also Read ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఇన్ యాక్షన్ - స్పెషల్ ఫ్లైట్‌లో ముంబైకు పవన్