యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉంటారు. ఆయన ఎప్పుడూ ఎప్పటికి అప్పుడు అప్ టు డేట్ అప్‌డేట్‌లో ఉంటారు. ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే 'ఆర్ఆర్ఆర్' విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలను మళ్ళీ ఓసారి చూడండి. ఉదాహరణకు... 'అట్లుంటది మనతోని', 'నాకు ఆ కోకా కోలానే కావాలి', 'అయామ్ టెల్లింగ్ దట్' వంటి మీమ్ పేజీల్లో కనిపించే డైలాగులు అన్నీ ఎన్టీఆర్ నోటి వెంట వచ్చాయి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... 


అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అమిగోస్' ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా వచ్చారు. ఆయన స్పీచ్ చివర్లో అభిమానులకు క్లాస్ పీకారు. అప్‌డేట్స్ అంటూ దర్శక నిర్మాతలపై ఒత్తిడి తీసుకు రావద్దని కించిత్ అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా కొత్త కబురు ఉంటే నా భార్య కంటే ముందు మీకే చెబుతానన్నారు. ఆయన మాటల్లో కోపం కూడా కనిపించింది. అందుకు కారణం ఏమిటి? సోషల్ మీడియాలో మీమ్ పేజీలు, అభిమానులు చేస్తున్న అతి ఆయన చూశారా? ఆయనకు ఆ అతి చికాకు తెప్పించిందా? ఒక్కసారి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది? అనే విషయానికి వెళితే... 


రీసెంట్ ట్విట్టర్ ట్రెండ్స్ చూస్తే... దళపతి విజయ్ కొత్త సినిమా 'లియో' గురించి విపరీతంగా హడావిడి నడిచింది. గ్యాప్ లేకుండా అప్‌డేట్స్ ఇచ్చారు. ముందు సంజయ్ దత్ నుంచి మొదలు పెడితే ప్రియా ఆనంద్, యాక్షన్ కింగ్ అర్జున్, ఇంకా ఇతర ఆర్టిస్టుల వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత విజయ్ జోడీగా త్రిష నటిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలు చేసి వీడియో విడుదల చేశారు. ఆ వెంటనే కశ్మీర్ షెడ్యూల్ మొదలుపెట్టి ఎయిర్ పోర్టులో వీడియోలు విడుదల చేశారు. ఒకదాని వెంట మరొకటి... 'లియో' కబుర్లు వచ్చాయి. 


తమిళ హీరోలను చూసి నేర్చుకోండి!
అసలు, విజయ్ లాస్ట్ సినిమా ఎప్పుడు వచ్చింది? అంటే... మొన్న సంక్రాంతికి! 'వారసుడు'తో థియేటర్లలోకి వచ్చారు. మరో తమిళ హీరో అజిత్ కూడా సంక్రాంతికి 'తెగింపు' (తమిళంలో 'తునివు'తో) వచ్చారు. ఆయన కొత్త సినిమా గురించి కబుర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీమ్ పేజీల్లో టాలీవుడ్ స్టార్స్ మీద సెటైర్లు పడ్డాయి. తమిళ హీరోలను చూసి నేర్చుకోమంటూ సూటిగా కామెంట్స్ చేశారు. మరోవైపు అప్‌డేట్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో గోల గోల చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మీద, దర్శకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఏదైనా అనౌన్స్ చేయడం ఆలస్యం... ఎన్టీఆర్ 30 సంగతి ఏంటి? అని క్వశ్చన్ చేస్తున్నారు. అభిమానులతో పాటు మీమర్స్ చేస్తున్న సోషల్ మీడియా ట్రెండ్స్ కు ఎండ్ అనేది లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు.






ఎన్టీఆరూ అర్థం చేసుకోవాలిగా!
అభిమానులలో కొందరు చేస్తున్న కామెంట్స్ శృతి మించుతున్నాయనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. అంతే కాదు... కొందరు హద్దులు మీరుతున్నారు. అందువల్ల, ఎన్టీఆర్ ఆ విధంగా మాట్లాడటం వెనుక ఆలోచనను అర్థం చేసుకోవాల్సిందే. అయితే, అదే సమయంలో ఎన్టీఆర్ కూడా అభిమానుల ఆవేదన అర్థం చేసుకోవాలి. 


Also Read : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ 32 - తమిళ దర్శకుడితో కాదు, తెలుగోడితోనే!


'ఆర్ఆర్ఆర్'ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది కావొస్తున్నా ఎన్టీఆర్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. హిట్టో ఫ్లాపో రామ్ చరణ్ 'ఆచార్య'లో కనిపించారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేశారు. మిగతా సినిమాలను లైనులో పెడుతున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ ఒక్క సినిమా దగ్గరే ఆగిపోయారు. ఏడాదిన్నర క్రితం 'ఆర్ఆర్ఆర్' లాస్ట్ షెడ్యూల్ అప్‌డేట్ తర్వాత ఆయన నుంచి మరో షూటింగ్ అప్‌డేట్ లేదు. తమ అభిమాన కథానాయకుడి కెరీర్‌లో ఏడాదిన్నర విలువైన సమయం వృథా అయ్యిందని ఫీలవుతున్నారు. ప్లానింగ్ సరిగా లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఏది ఎలా ప్లాన్ చేయాలో ఎన్టీఆర్‌కు తెలియదా? ప్రతి సినిమాకు బోలెడు ఈక్వేషన్లు కుదరాలి, కలవాలి. ఆలస్యం అవుతుందని హడావిడిగా ఏదో ఒకటి చేసేయలేరు కదా! ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటే మండుతుంది మరి! 


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?