ఫొటోలో పిలకతో ఉన్న హీరో ఎవరో కనిపెట్టారా? ఇంకా లేదా? అతను బాలీవుడ్ స్టార్ హీరో. ఇప్పటికైనా గుర్తు వచ్చాడా? అతను మరెవ్వరో కాదు.. సల్మాన్ ఖాన్. 


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరికొత్త లుక్ లో కనిపించాడు. తన లేటెస్ట్ మూవీ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ కోసం కొత్త అవతార్ లో  దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ నయా లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సల్మాన్ కు సంబంధించిన ఈ లేటెస్ట్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన నైయో లగ్డా, బిల్లి బిల్లీ అనే రెండు సింగిల్స్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సల్మాన్ న్యూ లుక్


ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరికొత్త లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆయన  కొత్త లుక్‌కి సంబంధించిన అనేక ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో కనిపించాయి. ఈ ఫోటోలలో అతడు నల్లటి టోపీ, నల్లటి టీ-షర్ట్ ఎప్పటిలాగే ఆకర్షణీయంగా ఉన్నాడు.  అతడి అభిమానులు ఆయన కొత్త అవతార్‌ చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలపై నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఓ నెటిజన్ పర్ఫెక్ట్ లుక్ అని రాయగా, మరో నెటిజన్ పఠాన్ లుక్ అంటూ కామెంట్ చేశాడు. అద్భుతమైన లుక్, ఈ చిత్రం కోసం వేచి ఉండలేకపోతున్నాను అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.


ఆకట్టుకుంటున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ టీజర్


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్‌ డే కానుకగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. “ఒప్పు ఒప్పే, తప్పు తప్పే” అంటూ మొదలయ్యే టీజర్ అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంది. టీజర్ లో ఎక్కువ భాగం ఫైట్ సీన్లతోనే నిండిపోయింది. ఇందులో వెంకటేష్ సంప్రదాయ లుక్ లో కనిపించారు. బతుకమ్మను పట్టుకుని వస్తూ దర్శనం ఇచ్చారు. అటు జగపతి బాబు విలన్ గా పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు.  






‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్ దగ్గుబాటి, పూజా హెగ్డే, జగపతి బాబు, భూమికా చావ్లా, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ మరియు వినాలి భట్నాగర్ నటించారు. సల్మా ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు.  యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ సమపాళ్లలో ఉంటాయన్నారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్‌ 4న ఈ మూవీ రిలీజ్‌ కానుంది. జీ స్టూడియోస్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనుంది.


3 దశాబ్దాల తర్వాత మళ్లీ బాలీవుడ్ మూవీ చేస్తున్న వెంకీ


1993లో ‘అనారి’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వెంకీ.. ఆ తర్వాత ‘తక్‌దీర్‌’ వాలా (1995) అనే మరో హిందీ సినిమాలో నటించారు. అనంతరం తెలుగు సినిమాల్లో బిజీ స్టార్‌గా మారిపోవడం వల్ల బాలీవుడ్ వైపు చూడలేదు. సుమారు 28 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’ సినిమాతో మరో మారు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పూజ అన్న పాత్రలో వెంకటేష్  కనిపించబోతున్నారు.  సల్మాన్ ఇటీవల ‘గాడ్‌ఫాదర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో సల్మాన్ తన సొంత బ్యానర్‌లో తెలుగు సాంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వడం విశేషం.


Read Also: సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ టీజర్: బతుకమ్మతో వెంకటేష్, విలన్‌గా జగపతిబాబు