తెలుగు ప్రేక్షకులు విశాల హృదయులు. తెలుగు, తమిళ, మలయాళ వంటి లాంగ్వేజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ సినిమాలు చూస్తారు. ఈ దీపావళికి మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన 'లక్కీ భాస్కర్' తెలుగులో భారీ విజయం సాధించింది. తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన 'అమరన్' మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం 'క' సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అయితే ఆ సినిమాకు తమిళనాడులో థియేటర్లు లభించడం లేదు.
చెన్నైలో తెలుగు షోలకు స్క్రీన్లు ఇవ్వడం లేదు!
'క' విజయం సాధించిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ సిటీలో థాంక్స్ మీట్ నిర్వహించారు. తాను తప్పులు చేసినప్పుడు ప్రేక్షకులు కొంతమంది తిట్టారని, ఇప్పుడు మంచి సినిమా చేసినప్పుడు జనాలు అందరూ ప్రశంసలు కురిపించడంతో పాటు తమ సొంత సినిమా విజయం సాధించినంతగా సంబరపడుతున్నారని కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేశారు. తమిళనాడులో తన సినిమాకు స్క్రీన్లు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలలో టికెట్లు లభించడం లేదని తనకు చాలా మంది ప్రేక్షకులు ఫోన్లు చేస్తున్నారని, స్క్రీన్ లో పెంచమని నిర్మాత వంశీ నందిపాటికి గంటకు ఒక ఫోన్ చేస్తున్నానని కిరణ్ అబ్బవరం తెలిపారు.
Also Read: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
చెన్నై నుంచి తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఫోన్లు చేస్తున్నారని 'క' తమిళ వెర్షన్ విడుదల గురించి తాను అడగడం లేదని, తెలుగు షోలు ఐదారు వేయడానికి స్క్రీన్లు అడుగుతుంటే ఇవ్వడం లేదని కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్షన్లు ముఖ్యం కాదంటున్న కిరణ్ అబ్బవరం!
తెలుగు రాష్ట్రాలలో కా మంచి టాక్ తెచ్చుకుంది రెండు రోజుల్లో ఈ సినిమా 13 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే తనకు కలెక్షన్లు ముఖ్యం కాదని కిరణ్ అబ్బవరం చెబుతున్నారు.
సాధారణంగా ఎవరికైనా హిట్టు వస్తే హిట్టు కొట్టాడని అంటారని తన విషయంలో హిట్ కొట్టేసామని ప్రేక్షకులు చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 'క' సీక్వెల్ కోసం దర్శకులు దగ్గర మంచి ఐడియా ఉందని అతి త్వరలో ఆ సినిమాను అనౌన్స్ చేస్తామని చెప్పారు. వచ్చే వారం లోపు 'క' సీక్వెల్ గురించి అనౌన్స్ రావచ్చు.
Also Read: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!