Kim Kardashian Poses With Lord Ganesha Idol: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో పలువురు అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. అమెరికన్ రియాలిటీ షో హోస్టు, నటి కిమ్ కర్దాషియాన్ కూడా తన సోదరితో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నది. పెళ్లి సంబురాల్లో కిమ్ సిస్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఓ ఫోటో షూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఇందులో ఓ ఫోటోను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలకు షాక్ అయిన కిమ్, వెంటనే ఆ పిక్ ను డిలీట్ చేసింది.
ఇంతకీ ఆమె ఫోటోలో ఏం ఉందంటే?
కిమ్ తాజా ఫోటో షూట్ లో ట్రెడిషనల్ వేర్ లో దర్శనం ఇచ్చింది. పలు రకాలుగా ఫోటోలకు పోజులిచ్చింది. అక్కడే ఉన్న వినాయకుడి తల మీద వాలిపోయి ఓ ఫోటో దిగింది. ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసి చాలా మంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. హిందువుల మనోభావాలను తీసేలా కిమ్ ప్రవర్తించిందంటూ మండిపడ్డారు. ఇండియాకు ఇలాంటి పనులు చేయడానికే వచ్చావా? అంటూ సీరియస్ అయ్యారు. నెటిజన్ల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో వెంటనే కిమ్ ఆ ఫోటోను డిలీట్ చేసింది. అయితే, మరికొంత మంది ఆమెపై దాడిని ఖండిస్తున్నారు. కిమ్ కావాలని అలా చేసి ఉండదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలనేది తన ఉద్దేశం కాదంటున్నారు. మొత్తానికి ఫోటో డిలీట్ తో ఆ వివాదానికి తెరపడింది.
కిమ్ కు సపోర్టు చేస్తున్న మరికొంత మంది నెటిజన్లు
నిజానికి కొంత మంది విదేశీయులు హిందూ దేవతలను అపహాస్యం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంత మంది హిందూ దేవతల ఫోటోలను డోర్ కర్టెన్లుగా, మ్యాట్లుగా, అలంకార వస్తువులుగా భావించి, పిచ్చివేషాలు వేశారు. అప్పుడు కూడా, సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో క్షమాపణలు చెప్పిన ఘటన ఉన్నాయి. అయితే, ఆ కోణంలో కిమ్ ఫోటోను చూడాల్సిన అవసరం లేదని మరికొంత మంది వాదిస్తున్నారు. దురుద్దేశపూర్వకంగా ఆమె ఈ పని చేసి ఉండదంటున్నారు. అటు కిమ్ అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన వీడియోలను ప్రత్యేకంగా షూట్ చేశారు. త్వరలోనే ఈ పెళ్లి వేడుకను కిమ్ రియాలిటీ షోలో ప్రసారం చేసే అవకాశం ఉంది. ‘ది కర్దాషియన్స్’ 6వ సీజన్ లో ఈ పెళ్లి వేడుకలను టెలీకాస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.