Balagam Movie Nominated in 8 Categories: జబర్దస్త్‌ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'బలగం'. గతేడాది విడుదలైన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్‌ కొట్టింది. అంతేకాదు సినీ దిగ్గజాల ప్రశంసలు కూడా అందుకుంది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన తొలి చిత్రం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బలగం మూవీకి మంచి గుర్తింపు లభించింది. తెలంగాణ సంస్కృతి, మూలాలు నేపథ్యంలో వేణు బలగం చిత్రాన్ని తెరకెక్కించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు.


తెలంగాణ కుటుంబ నేపథ్యం, భావోద్వేగంతో వచ్చిన ఈ సినిమా గతేడాది మార్చి 8న థియేటర్లో విడుదలైంది. మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించడమే కాదు.. ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఇంటర్నేషనల్‌ స్థాయిలో బలగం మూవీకి గుర్తింపు లభించింది. అయితే తాజాగా ఈ మూవీ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఆర్‌ఆర్‌ఆర్‌, సీతారామం వంటి పాన్‌ ఇండియా చిత్రాలకు పోటీగా ఈ సినిమా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల బరిలో నిలిచింది. 2024 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులో ఈ చిత్రం ఏకంగా ఎనిమిది కేటగిరిల్లో నామినేట్‌ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్‌ రాజు తన ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. 






ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్తమ స‌హ‌య నటుడు, ఉత్త‌మ సంగీతం, ఉత్త‌మ లిరిక్స్, ఉత్తమ స‌హ‌య నటితో పాటు ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్( మేల్, ఫిమేల్) ఇలా 8 కేట‌గిరీల్లో బలగం మూవీ నామినేట్ అయ్యింది. ఇక ఈ అవార్డు ఫలితాల‌ను త్వ‌ర‌లోనే ఫల్మ్‌ఫేర్‌ వెల్ల‌డించ‌నుంది. కాగా ఈ సినిమాలో ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్‌ రామ్‌ హీరోహీరోయిన్లుగా నటించగా.. వేణు ఎల్దండి, మురళీధర్ గౌడ్‌, జయరామ్‌, రూప, రచ్చ రవి తదితర నటీనటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా శ్రీవెంకటేశ్వర్‌ క్రియేషన్స్‌పై టాలీవుడ్‌ అగ్ర నిర్మాత 'దిల్‌' రాజు నిర్మించడం విశేషం. 



ఈ సినిమా కథ విషయానికి వస్తే


సాయిలుకి (ప్రియదర్శి) పెళ్ళికి కుదురుతుంది. రెండు రోజుల్లో నిశ్చితార్థం అనగా అతడి తాతయ్య (సుధాకర్ రెడ్డి) మరణిస్తాడు. దీంతో సాయిలు ప్లాన్‌ రివర్స్‌ అవుతుంది. ఎంగేజ్‌మెంట్‌ రోజునే వచ్చే పది లక్షల కట్నంతో అప్పు తీరుద్దామని అనుకున్న అతడి ప్లాన్ బెడిసి కొడుతుంది. అయితే అతడి తాతయ్య చావుకు వచ్చిన పెళ్లి తరపున వారితో జరిగిన గొడవ కారణంగా అతడి పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. తాతయ్య భౌతిక కాయం చూడటానికి వచ్చిన మేనత్త కూతురు సంధ్య (కావ్యా కళ్యాణ్ రామ్)ను చూస్తాడు. మావయ్యకు బోలెడు ఆస్తి ఉందని తెలుస్తుంది. సంధ్యను ప్రేమలో పడేసి, పెళ్ళి చేసుకుంటే అప్పు తీరుతుందని ప్లాన్ వేస్తాడు. అయితే అప్పటికే సాయిలు తండ్రి (జయరాం)కి, అతడి మేనత్త భర్త మావయ్యకు (మురళీధర్) మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలకు కారణం ఏమిటి? కాకి ఎందుకు ముద్ద  (మరణించిన వ్యక్తులకు పెట్టే భోజనం) ముట్టలేదు? అతడి తాతయ్య ఆత్మ కోరుకుంది ఏమిటి? అందుకోసం గొడవల్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులు ఏం చేశారు? అనేదే ఈ బలగం మూవీ కథ. 


Also Read: అప్పుడే ఓటీటీకి ప్రభాస్‌ 'కల్కి 2898 ఏడీ' - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..