Kiccha Sudeep : కన్నడ స్టార్ హీరో, ‘ఈగ’ మూవీ విలన్ కిచ్చా సుదీప్ మరో వండర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. డిసెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌‌పై యూనిట్ దృష్టి పెట్టింది. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ని వదిలారు మేకర్స్. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే.. 


‘మా పొలిటికల్ కెరియర్‌కి ఈ రాత్రి చాలా ఇంపార్టెంట్’ అనే ఇంటెన్స్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. యాక్షన్ సన్నివేశాలతో నడిపిస్తూ.. మూవీ కాన్సెప్ట్‌ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ఇదేంటి ‘కోట బొమ్మాళి పీఎస్’ ఫ్లాట్‌‌లో వెళుతుంది అనుకునే సమయంలో.. ‘ఒకవేళ చావు ఎదురొచ్చినా సరే.. మా అబ్బాయి ఒంటరిగా నిలబడి పోరాడతాడు’ అంటూ హీరోకి వాళ్ల అమ్మతో ఎలివేషన్ ఇప్పించేలా డైలాగ్ సినిమాలోని డెప్త్‌ని తెలియజేస్తుంది. స్టార్టింగ్ వచ్చిన డైలాగ్‌కి కౌంటర్ అన్నట్లుగా హీరో చెప్పే డైలాగ్ ‘ఈ ఒక్కరోజు రాత్రే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడదాం’ అనడం ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అనే మూడ్‌లోకి మార్చేసింది. మార్చేయడమే కాదు.. ‘సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చే ప్రతి పకోడీ గాడు సమాజ సేవకుడే.. మొత్తం క్లీన్ చేసి పారేద్దాం’ అనే డైలాగ్ మరోసారి క్లారిటీ కూడా ఇచ్చేసింది. 


Also Read: Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్


ఇక ఫైనల్‌గా ‘మ్యాక్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మ్యాగ్జిమమ్ సైలెన్స్ ఉండాలి’ అని హీరో ఇచ్చిన టచ్ థియేటర్లో ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్ పక్కా అనేలా ఉంది. కాకపోతే.. డబ్బింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్య కాలంలో సుదీప్ నుంచి కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద అంతగా నిలబడలేకపోతున్నాయి. కానీ ఈ సినిమాలో బాక్సాఫీస్‌ని షేక్ చేసే కంటెంట్ ఉందనే విషయాన్ని ఈ ట్రైలర్ క్లియర్ చేసేస్తోంది. డబ్బింగ్ విషయంపై మాత్రం మేకర్స్ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ‘ఈగ’లో, ఈ మధ్యకాలంలో సుదీప్ నుంచి వచ్చిన సినిమాలలో ఆయన వాయిస్ విన్నవారు.. ఈ ట్రైలర్‌లోని హీరో వాయిస్‌‌కి కనెక్ట్ కాలేకపోతున్నారు. అలాగే పాన్ ఇండియా యాక్టర్‌గా మారిన సునీల్‌కు చెప్పించిన డబ్బింగ్ కూడా అంత ఇంపాక్ట్‌గా లేదు. విజువల్స్, మ్యూజిక్, నిర్మాణ విలువలు, సుదీప్ స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం హైలెట్ అనేలా ఉన్నాయి.



ఈ ట్రైలర్ చూస్తుంటే.. సునీల్‌కు అలాగే వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్‌కు కూడా మంచి పాత్రలు దక్కినట్లుగా అర్థమవుతోంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కిచ్చా సుదీప్ నటిస్తున్నారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో విడుదలకానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకుడు. టాలీవుడ్‌లో ఈ సినిమా ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే..


Also Read : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్!