Keshav Chandra Ramavath Song Launch: జబర్దస్త్ షోలో కామెడియన్‌గా గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు హీరోగా మారిన వారి లిస్ట్‌లో రాకింగ్ రాకేశ్ కూడా చేరాడు. తను హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్న చిత్రమైన ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమవత్) సినిమా గురించి ఇప్పటికే ప్రకటించాడు. ఇక తాజాగా ఈ మూవీలోని ‘తెలంగాణ తేజం’ అనే పాటను మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చేతుల మీదుగా విడుదల చేయించింది మూవీ టీమ్. నంది నగర్‌లోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లిన మూవీ టీమ్.. ఆయన చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేయించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కార్యక్రమంలో రాజకీయ నాయకులు..
కేసీఆర్ చేతుల మీదుగా ‘తెలంగాణ తేజం’ పాటను లాంచ్ చేయించడం కోసం రాకింగ్ రాకేశ్‌తో పాటు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, రాకేశ్ భార్య జోర్ధార్ సుజాత, సింగర్ విహ, రచయిత సంజయ్ మహేష్.. నంది నగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాలిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధన చారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ కూడా పాల్గొన్నారు.
రెండో పాట..
ఇప్పటికే ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమవత్) సినిమా నుండి ‘యాది యాది’ అనే పాట విడుదలయ్యింది. ఆ పాటను సెన్సేషనల్ సింగర్ రామ్ మిరియాల ఆలపించాడు. ‘యాది యాది’ పాట ఇప్పటికే పలువురు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. అలాగే ‘తెలంగాణ తేజం’ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ‘కేసీఆర్’ అనే సెన్సేషనల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సపోర్ట్ చేయడానికి పలువరు జబర్దస్త్ కామెడియన్స్ ముందుకొచ్చారు. ప్రమోషన్స్‌లో భాగంగా సాంగ్స్ విడుదల చేస్తున్నా కూడా ఇంకా ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్.
జబర్దస్త్‌తో ఫేమ్..
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో కామెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రాకేశ్. మిగతా కంటెస్టెంట్స్ లాగా కాకుండా కేవలం చిన్న పిల్లలనే టీమ్ మెంబర్లుగా పెట్టుకొని, వారితోనే కామెడీ చేయించి అందరినీ ఎంటర్‌టైన్ చేసేవాడు. ఇక జోర్దార్ సుజాత కూడా కామెడియన్‌గా రాకింగ్ రాకేశ్ టీమ్‌లో జాయిన్ అయ్యింది. వీరిద్దరూ అదే షోలో పరిచయమయ్యి ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. రాకేశ్, సుజాత.. ఇద్దరూ ఇప్పటికే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు రాకేశ్ ఏకంగా హీరోగా మారి ‘కేసీఆర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
Also Read: ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్ విడుదల - 50 ఏళ్ల వయసులో డీజే అవ్వాలనుకుంటున్న హీరో