Music Shop Murthy Trailer Out Now: టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నారు అజయ్ ఘోష్. ఎప్పుడూ సీరియస్ క్యారెక్టర్లలోనే కనిపించే అజయ్.. మొదటిసారిగా కామెడీ రోల్‌కు షిఫ్ట్ అవుతూ చేసిన సినిమానే ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. అంతే కాకుండా ఈ మూవీలో అజయ్ ఘోష్ లీడ్ రోల్ కనిపించడం విశేషం. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. అసలు ఈ సినిమా కథ ఏంటి అని దాదాపుగా ట్రైలర్‌లోనే బయటపెట్టేశాడు డైరెక్టర్.


గయ్యాళి భార్య..


‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్‌లో ఎగ్జిబిషన్‌లో, ఫంక్షన్స్‌లో మ్యూజిక్ అరేంజ్ చేసే వ్యక్తిగా.. మ్యూజిక్ షాప్ మూర్తిగా ఫేమస్ అయిన అజయ్ ఘోష్ ఎంట్రీ ఇస్తారు. అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్‌ను ద్వేషిస్తూ.. తనను వేధించే భార్య పాత్రలో ఆమని కనిపిస్తుంది. ‘‘ఒకసారి బయటికి వెళ్తే.. ఇంటికి రావా నువ్వు’’ అంటూ అజయ్ ఘోష్‌పై విరుచుకుపడుతుంది. ‘‘అందరికీ సుబ్బలక్ష్మి సుప్రభాతం పాడితే.. నాకు మాత్రం నువ్వు పాడతావు’’ అంటూ ఆమనిపై కౌంటర్లు ఇస్తుంటారు అజయ్. తనను మ్యూజిక్ షాప్ మూసేయమని, సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందామని ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది ఆమని. ‘‘నాన్న మ్యూజిక్ కలెక్షన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు’’ అంటూ తండ్రికి సపోర్ట్ చేస్తుంది కూతురు.


డీజే చాందిని చౌదరీ..


మ్యూజిక్ అంటే తనకు ఎంత ఇష్టమున్నా.. మ్యూజిక్ షాప్ వల్ల సంపాదన రావడం లేదని అజయ్ కూడా ఫీల్ అవ్వడం మొదలుపెడతారు. ‘‘నాకు తెలిసింది మ్యూజిక్ ఒక్కటే. ఏదైనా సంపాదించాలంటే దీంట్లోనే ఏదైనా కొత్తగా చేసి సంపాదించాలి’’ అని నిర్ణయించుకుంటారు. అదే సమయంలో డీజే అవ్వాలని కలలు కనే చాందిని చౌదరీ తనకు పరిచయమవుతుంది. తన దగ్గర డీజే నేర్చుకొని డీజే అవ్వాలనుకుంటారు అజయ్. ఈ విషయం ఆమనికి తెలుస్తుంది. ‘‘నేనేమో నిన్ను మ్యూజిక్ షాప్ నుంచి బయటపడేయాలని చూస్తుంటే నువ్వేమో ఇంకా లోపలికి వెళ్లిపోతున్నావు’’ అని వాపోతుంది. భర్తను ఇంట్లో నుంచి గెంటేస్తుంది. దీంతో వేరే దారిలేక డీజే అవ్వాలనే కోరికతో హైదరాబాద్‌కు వస్తారు అజయ్.


కామెడీ ప్లస్ సీరియస్ డ్రామా..


హైదరాబాద్‌కు ఒంటరిగా డీజే అవ్వాలనే కోరికతో వచ్చిన అజయ్.. చాలా కష్టాలు పడతారు. ఎన్నో అవమానాలు ఎదుర్కుంటారు. ఇలా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ డీజేగా ఎలా మారాడు అనేది సినిమా కథ అని ట్రైలర్‌లో తెలిసేలా చేశాడు దర్శకుడు. ఇందులో ‘‘డీజే అంటే దువ్వాడ జగన్నాధం’’లాంటి కామెడీ డైలాగులతో పాటు ‘‘జీవితంలో మనం ఇష్టపడి ఒకటి నేర్చుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మనం దానిని వదిలిపెట్టకూడదు’’ లాంటి సీరియస్ డైలాగులు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే మూవీలో కామెడీతో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అర్థమవుతోంది. ఇదొక రొటీన్ కమర్షియల్ సినిమాలాగా కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే సోషల్ మెసేజ్ మూవీగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ వచ్చింది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.



Also Read: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆడియన్స్ రివ్యూ: పుష్ప ఫాస్ట్ ట్రాక్... ఎన్టీఆర్‌తో తీస్తే ఇంకా బాగుండేదా? జనాలు గొర్రెలు డైలాగ్ ఏంట్రా బాబూ!