Kasthuri Shankar: ఒకప్పుడు వెండితెరపై హీరోయిన్లుగా వెలిగిపోయినవారు.. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లు ఉంటే కమ్ బ్యాక్ ఇవ్వడానికి ఇంకా ఎంతోమంది హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారు. అందులో కస్తూరి శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగిపోయిన తను.. మళ్లీ సినిమాల్లోకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా తను ఎన్ని అవకాశాలను కోల్పోయారో చెప్పుకొచ్చారు.


మూడుసార్లు మిస్ అయ్యింది..


‘‘మోహన్ బాబుతో కలిసి ‘ఎమ్ ధర్మరాజు’ ఎమ్మెల్యే సినిమాలో చేయాల్సింది కానీ చేయలేదు. అప్పటికీ నేను చేస్తాననే అనుకున్నాను. రజినీకాంత్‌తో మూడుసార్లు నటించే అవాకాశం వచ్చి మిస్ అయ్యింది. అది చాలా బాధగా అనిపించింది. ‘కాలా’లో చేయాల్సింది. కానీ నేను చాలా యంగ్‌గా ఉన్నాను. రజినీకాంత్ పక్కన ముగ్గురు పెద్ద పిల్లలకు అమ్మలాగా లేను అని చెప్పి ఈశ్వరి రావును తీసుకున్నారు. చిరంజీవి నటించిన హిందీ మూవీ జెంటిల్‌మ్యాన్‌లో జూహీ చావ్లా హీరోయిన్‌గా చేసింది. కానీ ముందు ఆ అవకాశం నాకు వచ్చింది, మహేశ్ భట్ నన్ను ఓకే చేశారు కూడా. అప్పుడు నాకు టైఫాయిడ్ వచ్చింది. దాంతో అదీ పోయింది. గతేడాది కళ్యాణ్ రామ్ నటించిన ‘డెవిల్’ మూవీలో కూడా అవకాశం వచ్చింది’’ అని తను పోగొట్టుకున్న అవకాశాల గురించి చెప్పుకొచ్చారు కస్తూరి.


ఇదెక్కడి గొడవ..


‘‘డెవిల్ మూవీలో నేను చేయాల్సిన పాత్రను సీత చేశారు. ఎందుకంటే ఆ పాత్రకు నేను చాలా యంగ్‌గా కనిపిస్తానని చెప్పి సినిమా సైన్ చేసిన తర్వాత వేరే ఆర్టిస్ట్‌ను ఎంచుకున్నారు. సీతకు ఇది తెలుసు. అందుకే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఆమె నా దగ్గర నుంచి లాక్కోలేదు. నాకు అదే బాధ. వయసు అవ్వడం లేదు అవ్వాలి అని ఫీల్ అవుతున్నాను. నాకు ఇంకా తెల్లజుట్టు రావడం లేదు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలో క్యారెక్టర్ సీనియర్‌గా కనిపించాలని జుట్టుకు తెల్లరంగు వేసుకొని చేయాల్సి వస్తుంది. ఇలా అయిపోయింది నా బ్రతుకు. తెల్ల మేకప్ వేయకపోతే యంగ్‌గా కనిపిస్తున్నాను, సెట్ అవ్వడం లేదు అంటున్నారు. ఇదెక్కడి గొడవ’’ అని వాపోయారు కస్తూరి శంకర్.


అవకాశాలు కచ్చితంగా వస్తాయి..


వయసు అయిపోయిన తర్వాత అవకాశాలు రాకపోతే ఎలా అని ప్రశ్నించగా.. వస్తాయని ధీమా వ్యక్తం చేశారు కస్తూరి. ‘‘తల్లి పాత్రలంటే 30 ఏళ్ల వరకు తల్లిగానే ఉండొచ్చు. ఇప్పుడు నేను తల్లి పాత్రలు చేయలేను కదా. అందరు పెద్ద పెద్ద హీరోలు. మహేశ్ బాబుకు, నాకు ఒకటే వయసు. ఆయనకు తల్లిగా ఎలా చేస్తాను. చూడడానికి కూడా బాగుండదు. జోడీలాగా ఉంటాను. తల్లిలాగా ఉండాలి కదా. అది అవ్వదు’’ అని అన్నారు కస్తూరి శంకర్. అదే కారణంగా తను మళ్లీ వెండితెరపైకి కమ్ బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా అవకాశాలు రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఒకట్రెండు చిత్రాల్లో నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు కస్తూరి శంకర్.


Also Read: ఖరీదైన బంగ్లాలు, లగ్జరీ కార్లు - రామ్ చరణ్ కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?