గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఆయన అభిమానులకు 'గేమ్ ఛేంజర్' యూనిట్ ఓ గిఫ్ట్ ఇచ్చింది. 'జరగండి... జరగండి' సాంగ్ విడుదల చేసింది. ఈ పాట ఎలా ఉంది? తమన్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం ఎలా ఉన్నాయి? అనేది ఒక్కసారి చూడండి.
రామ్ చరణ్ కాదు... శంకర్ స్టైల్ సాంగ్!
సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Shankar Director)కు ఒక స్టైల్ ఉంది. ఆయన తీసిన 'అపరిచితుడు'లో 'కొండా కాకి కొండేదానా' (రండక రండక) సాంగ్ గుర్తుందా? ఆ సినిమా తర్వాత నుంచి తన ప్రతి సినిమాలో అటువంటి సాంగ్ ఒకటి ఉండేలా చూసుకుంటున్నారు శంకర్. 'జరగండి... జరగండి' సాంగ్ వింటే ఆ సాంగ్ గుర్తుకు రావడం గ్యారంటీ. ఇది పక్కా శంకర్ స్టైల్ సాంగ్ అని చెప్పాలి. సంగీత దర్శకుడు తమన్ ఆ మాస్ & పెప్పీ స్టైల్ మిస్ కాకుండా చూసుకున్నారు.
రామ్ చరణ్ స్టైల్... కియారా గ్లామర్ సూపర్!
'జరగండి... జరగండి...' సాంగ్ ట్యూన్, లిరిక్స్ వంటి వాటితో సంబంధం లేకుండా రామ్ చరణ్ స్టైల్ అభిమానుల్ని అట్ట్రాక్ట్ చేయడం గ్యారంటీ. కియారా అడ్వాణీతో ఆయన వేసిన స్టెప్పులు, ఆమె గ్లామర్ సైతం పాటలో హైలైట్ అయ్యాయి. మధ్యలో విజువల్స్ కాసేపు చూపించినా... బావున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన స్టైల్ స్టెప్స్ కంపోజ్ చేశారు.
సిస్టమ్ తప్పిస్తే మొగుడండీ...
పూల పక్కపై సర్జికల్ స్ట్రైక్!
సాంగ్ వింటే, ఆ విజువల్స్ చూస్తే.... హీరో హీరోయిన్స్ మధ్య మాంచి డ్యాన్స్ నంబర్ అని అర్థం అవుతుంది. అయితే... పాట మధ్యలో కాస్త హీరో క్యారెక్టర్ చెప్పే ప్రయత్నం చేశారు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్. 'సిస్టమ్ తప్పిస్తే మొగుడు అండీ' అంటూ హీరోయిన్ చేత చెప్పించారు.
ఓవరాల్ లిరిక్స్ చూస్తే... సాహిత్యం పరంగా ప్రయోగాలు, ఆంగ్ల పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. 'మార్స్ నుంచి మాస్ పీస్ వచ్చెనండీ...', 'పూల పక్కపై మూడు పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తడే' అంటూ మాసీ లిరిక్స్ రాశారు. అయితే సాహిత్యంలో అంత గొప్పగా లేదు ఈ పాట. కానీ, మాస్ జనాల్ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
రామ్ చరణ్, కియారా అడ్వాణీ జంటగా శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థలో 50వ చిత్రమిది. తెలుగమ్మాయి అంజలి మరో కథానాయిక. సముద్రఖని, ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర ఇతర తారాగణం.
ఈ చిత్రానికి రచయితలు: ఎస్.యు. వెంకటేశన్, ఫర్హద్ సామ్‌జీ & వివేక్, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సహ నిర్మాత: హర్షిత్, ఛాయాగ్రహణం: ఎస్. తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, నిర్మాతలు: దిల్ రాజు & శిరీష్, దర్శకత్వం : శంకర్.