Kasthuri Shankar about Vijayashanthi: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి శంకర్.. ఇప్పుడు సీరియల్స్‌కు పరిమితమయ్యారు. సినిమాల్లో కూడా చిన్న చిన్న రోల్స్‌లో కనిపిస్తున్న.. ఇతర హీరోయిన్లు ఇచ్చినట్టుగా ఇంకా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వలేకపోయారు. ఒకప్పుడు కూడా ఆమె తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాల్లో నటించి, కోలీవుడ్ ప్రేక్షకులకే ఎక్కువగా దగ్గరయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి.. తన టాలీవుడ్ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అసలు తన కెరీర్ ఎలా ప్రారంభమయ్యిందో బయటపెట్టారు. అప్పటి హీరోయిన్లను ఇప్పటి హీరోయిన్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు.


‘నిప్పురవ్వ’ జ్ఞాపకాలు..


తమిళంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సమయంలోనే తెలుగులో ‘నిప్పు రవ్వ’లో కస్తూరి శంకర్‌కు అవకాశం వచ్చింది. ఆ సినిమాలో తను హీరోయిన్‌గా కాకుండా బాలకృష్ణకు చెల్లెలి పాత్రలో కనిపించడానికి సిద్ధపడింది. అదే తెలుగులో తన మొదటి చిత్రం. ఇంటర్వ్యూలో ‘నిప్పు రవ్వ’ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు కస్తూరి శంకర్. ‘‘అప్పటికే తమిళంలో పెద్ద హీరోయిన్ అయిపోయాను. నా కెరీర్‌లో నిప్పు రవ్వ రెండో సినిమా. దానికి సంబంధించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. విజయశాంతి హీరోయిన్‌గా మాత్రమే కాదు.. ప్రొడక్షన్ కూడా చేశారు’’ అని చెప్తూ విజయశాంతిని ప్రశంసల్లో ముంచేశారు కస్తూరి శంకర్. ఆమెను చూసి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు.


చాలా సింపుల్..


‘‘విజయశాంతిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఇలా సింపుల్‌గా వచ్చానంటే ఆ సింప్లిసిటీకి కారణం అప్పటి హీరోయిన్లే. విజయశాంతి అప్పట్లోనే ప్రొడ్యూసర్, లేడీ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్నారు. కానీ ఆమె ప్రవర్తన గురించి చెప్పడానికి మాత్రం మాటలు రావడం లేదు. అంత సింపుల్‌గా ఉంటారు. కడుపు నొప్పి వస్తున్నా కూడా రాత్రంతా ఆమె స్టంట్స్, ఫైట్స్ చేస్తూనే ఉన్నారు. ఆమె అందరితో మాట్లాడే పద్ధతి కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది’’ అంటూ విజయశాంతి గురించి చెప్పుకొచ్చారు కస్తూరి శంకర్. అంతే కాకుండా జయసుధ కూడా చాలా సింపుల్‌గా ఉంటారని, చెన్నైలో ఆమె ఇంటి పక్కనే ఉండేవారని గుర్తుచేసుకున్నారు.


ఏఎన్ఆర్ ఇంటికి వెళ్లాను..


‘‘మా అమ్మ, జయసుధ ఫ్రెండ్స్. అలాంటి వాళ్లని చూసి ముందుగా నేర్చుకోవాల్సింది సింపుల్‌గా ఉండడమే. ఇప్పుడు రోజులు మారిపోయాయి. జనాల ప్రవర్తనలో, యాటిట్యూడ్‌లో చాలా మార్పులు రావడం చూస్తున్నాను. సీనియర్ ఆర్టిస్టులు అలా కాదు’’ అంటూ అప్పటి నటీమణులపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కస్తూరి. అంతే కాకుండా నాగేశ్వర రావు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఏఎన్‌ఆర్‌తో నేను సినిమా చేశాను. ఆ సమయంలో ఆయన పుట్టినరోజుకు ఆయన ఇంటికి వెళ్లాను. నన్ను చూడగానే స్వయంగా ఆయనే వచ్చి పలకరించారు. అలా సీనియర్ల నుండి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు కస్తూరి శంకర్.


Also Read: మీ అక్కాబావలు అనుష్క శర్మ, విరాట్ కొహ్లీ మీ సినిమాలు చూస్తారా? రుహానీ శర్మ ఊహించని రిప్లై