Pushpa 2 Teaser Release Date: ‘పుష్ప’ అనే ఒక్క సినిమా అల్లు అర్జున్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌కు దగ్గర చేసింది. అయితే ఈ సినిమా కథ ఇంకా పూర్తవ్వలేదని, పార్ట్ 2లో చూడండి అంటూ పార్ట్ 1ను ముగించాడు దర్శకుడు సుకుమార్. ఇది జరిగి రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది. అప్పటినుంచి అల్లు అర్జున్‌ను వెండితెరపై చూడలేదు ఫ్యాన్స్. ‘పుష్ప 2’ కోసమే వారంతా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా 2024 ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ అని మేకర్స్ ప్రకటించారు. అయినా ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. తాజాగా ‘పుష్ప 2’ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


టీజర్ అదే రోజు..


‘పుష్ప 2’ మూవీ రిలీజ్ డేట్ తప్పా గత కొన్నాళ్లుగా మేకర్స్.. ఏ అప్డేట్‌ను విడుదల చేయలేదు. షూటింగ్ ప్రారంభమయిన కొత్తలో ఒక గ్లింప్స్‌ను వదిలారు. దాంతో పాటు కొన్ని పోస్టర్స్ బయటికొచ్చాయి. ఇప్పటికీ ఫ్యాన్స్ అంతా వాటినే చూసుకుంటూ తృప్తిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యిందనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. మామూలుగా హీరోల బర్త్ డేకు వారి అప్‌కమింగ్ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ బయటికి రావడం కామన్ కావడంతో ‘పుష్ప 2’ నుంచి కూడా అలాగే వస్తుందని అందరూ భావిస్తున్నారు.


మిక్స్‌డ్ టాక్‌తో మొదలు..


2021 డిసెంబర్ 17న థియేటర్లలో విడుదలయ్యింది ‘పుష్ప’. విడుదలయిన మొదట్లో మిక్స్‌డ్ టాక్ అందుకున్నా.. ఈ సినిమాను తన నటనతో నిలబెట్టాడు అల్లు అర్జున్. ముఖ్యంగా తన మ్యానరిజం ప్రేక్షకులకు చాలా నచ్చేసింది. ‘తగ్గేదే లే’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ను అందరూ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా సినిమాలోని పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాయి. భాషతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సైతం ‘పుష్ప’ పాటలకు స్టెప్పులేయడం మొదలుపెట్టారు. అలా మెల్లమెల్లగా ‘పుష్ప’కు, అల్లు అర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రియాక్షన్ లభించడం ప్రారంభమయ్యింది.


నిజమయితే బాగుంటుంది..


ప్రస్తుతం ‘పుష్ప 2’ కోసం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. ‘పుష్ప 2’ టీజర్ ఏప్రిల్ 8న విడుదలయితే చాలు అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక ఇందులో అల్లు అర్జున్‌కు జోడీగా రష్మిక మందనా నటిస్తుండగా.. తాజాగా సెట్స్ నుంచి తన ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘పుష్ప’లో క్లైమాక్స్ వరకే పరిమితమయిన ఫాహద్ ఫాజిల్.. పార్ట్ 2లో మాత్రం మెయిన్ విలన్‌గా కనిపించనున్నారు. వీరితో పాటు సునీల్, జగదీష్, అజయ్, అనసూయ.. ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్.. భారీ స్థాయిలో ‘పుష్ప 2’ను నిర్మిస్తోంది.


Also Read: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, న‌టుడు డేనియ‌ల్ బాలాజీ హ‌ఠాన్మ‌ర‌ణం