హీరో సిద్ధార్థ్ ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ గురువారం తమిళం, కన్నడ భాషల్లో ఒకే రోజు రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం కర్ణాటక వెళ్లిన సిద్ధార్థ్‌కు అక్కడ ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు ఆటకం కలిగించారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులను కోరారు.
ఎందుకు గొడవ?
కావేరీ జలాలపై కర్ణాటక - తమిళనాడు మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దీనిపై తగిన పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టు తమిళనాడుకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం మాత్రం కేవలం 5 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసింది. దీనిపై తమిళనాడులో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
తమిళనాడుకు 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఇప్పటికే కావేరీ జలాల పరిరక్షణ ప్రతినిధులు శుక్రవారం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చారు. కర్ణాటక వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమయ్యారు. అదే సమయంలో తమిళ హీరో సిద్ధార్థ్ తన ‘చిత్తా’ మూవీ ప్రమోషన్స్ కోసం బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టిన విషయం తెలిసింది. దీంతో ఆందోళనకారులు అక్కడికి చేరుకుని సిద్ధార్థ్‌ను తమ నిరసనకు మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. అయితే, సిద్ధార్థ్ మాత్రం ఆందోళనకు ఏ మాత్రం చలించకుండా మౌనంగా ఉన్నాడు. చివర్లో విలేకరులకు వీడ్కోలు తెలిపి వేదికపై నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్ధార్థ్ సొంత బ్యానర్‌పై ‘చిత్తా’
సిద్ధార్థ్ తన సొంత బ్యానర్ ఎతకీ ఎంటర్‌టైన్మెంట్ కింద ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ మూవీకి దర్శకుడు. మలయాళ నటి నిమిషా సాజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళనాడులో ఈ మూవీ గురువారం విడుదలైంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. తెలుగులో కూడా ఈ రోజే విడుదల కావాలి. అయితే, అప్పటికే ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు’ సినిమాలు క్యూ కట్టిన నేపథ్యంలో అక్టోబరు 6కు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలిసింది.