బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో పాటుగా వివాదాలతో వార్తల్లో నిలిచే నటి ఆమె. సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ, ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. కంగనా తరచుగా టార్గెట్ చేసే బాలీవుడ్ ప్రముఖుల్లో స్టార్ ప్రొడ్యూసర్, డైరక్టర్ కరణ్ జోహార్ ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వారికి అవకాశాలు దూరం చేస్తాడని, టాలెంట్ లేని నెపోటిజం కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తాడని ఫైర్ అవుతూ ఉంటుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కరణ్ పై విరుచుకుపడే క్వీన్.. తాజాగా మరోసారి ట్రోల్ చేసింది.


కరణ్ జోహార్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’. ఇందులో బాలీవుడ్ స్టార్స్ రణవీర్‌ సింగ్, ఆలియా భట్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. జులై 28వ తేదీన విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే కంగన రనౌత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.250 కోట్లతో ఓ డైలీ సీరియల్‌ తీశారని ఎద్దేవా చేసింది. కరణ్‌ జోహార్‌ రిటైర్‌ అయిపోవాలని, టాలెంట్ ఉన్న కొత్త వాళ్లకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొంది. పనిలో పనిగా రణ్‌ వీర్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌ పై కూడా తీవ్రంగా మండిపడుతూ, సౌత్ స్టార్స్ ను చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చింది.


Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?


"భారతీయ ప్రేక్షకులు అణు ఆయుధం మూలం మరియు అణు శాస్త్రంలోని చిక్కులపై 3 గంటల నిడివి గల సినిమాని చూస్తున్నారు. (క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన హలీవుడ్ మూవీ 'ఓపెన్‌ హైమర్' ను ఉద్దేశిస్తూ). అందరూ అద్భుతాలు సృష్టిస్తుంటే ఈ నెపోటిజం గ్యాంగ్‌ మాత్రం రూ.250 కోట్ల బడ్జెట్‌ తో డైలీ సీరియల్స్‌ తీస్తున్నారు. ఇండియన్ సినిమా పతాకధారిగా చెప్పుకునే కరణ్.. ఇలాంటి చిత్రాలు తీసి ఇండస్ట్రీ శాశ్వతంగా తిరోగమనం దిశగా పయనించేలా చేస్తున్నందుకు సిగ్గుపడాలి" అని కంగనా తన పోస్టులో పేర్కొన్నారు.


"ఇండస్ట్రీకి ఇది అంత ఈజీ టైం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బును వృధా చేయకుండా.. ఇప్పుడే రిటైర్‌ అయిపో. న్యూ టాలెంటెడ్ ఫిలిం మేకర్స్ కు అవకాశాలు కల్పించు. వారిని విప్లవాత్మక చిత్రాలను తీయనివ్వండి" అంటూ కరణ్ జోహార్ ను ఉద్దేశిస్తూ కంగన పోస్ట్ పెట్టింది. "ప్రేక్షకులను ఇక మోసం చేయలేరు. నకిలీ సెట్‌లతో నిండిన దారుణమైన, పేలవమైన చిత్రాలను వారు తిరస్కరించారు. ఇలాంటి ఫేక్‌ సెట్స్‌, ఫేక్ కాస్ట్యూమ్స్‌ను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఎవరైనా అలాంటి దుస్తులు ధరిస్తారా?" అని కంగనా ప్రశ్నించారు.


"90లలో తాను తీసిన చిత్రాలనే కాపీ కొట్టి సినిమా తీసినందుకు కరణ్‌ జోహార్ సిగ్గుపడాలి. ఇలాంటి స్టుపిడ్ సినిమాపై 250 కోట్లు ఎలా ఖర్చు చేశాడు?. టాలెంట్ ఉన్న ఎంతో మంది యువత సరైన ఆర్థిక వనరులు లేక సినిమాలు తీయడానికి ఇబ్బంది పడుతుంటే, ఇంత డబ్బు ఆయనకు ఎవరు ఇచ్చారు?" అని కంగన రనౌత్ తన ఇన్స్టా పోస్టులో పేర్కొన్నారు.


"రణ్‌ వీర్‌ సింగ్ కు నేనిచ్చే సలహా ఒక్కటే.. డ్రెస్సింగ్‌ సెన్స్ విషయంలో దయచేసి కరణ్‌ ను ఫాలో అవ్వడం మానెయ్యాలి. సాధారణ వ్యక్తుల మాదిరిగా దుస్తులు ధరించు. ధర్మేంద్ర జీ, వినోద్‌ ఖన్నా జీ వంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకో. దక్షిణాది హీరోలందరూ ఎంత హుందాగా గౌరవంగా దుస్తులు ధరిస్తారో చూడు. వారు మన దేశ ప్రజల సంస్కృతిని నాశనం చెయ్యరు" అని కంగనా రాసుకొచ్చారు.


Read Also: 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial