తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌(Telugu Film Chamber Of Commerce) ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి. అయితే, ఫలితాల్లో మాత్రం చివరి వరకు ఉత్కంఠత నెలకొంది. నిర్మాత దిల్ రాజు ప్యానెల్‌లో అత్యధిక ఓట్లతో లీడింగులో ఉండటంతో వారే విజేత అని భావించారు. కానీ, డిస్ట్రిబ్యూటర్స్.. ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లలో ఓట్లు ఫలితాలు టై అయ్యాయి. 


దిల్ రాజు  vs సి.కళ్యాణ్: ఎవరెవరికి ఎన్ని?


దిల్ రాజు ప్యానెల్‌లో ప్రొడ్యూసర్ సెక్టార్‌లో పోటీ చేసిన 12 మందిలో ఏడుగురు విజయం సాధించారు. సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు గెలుపొందారు. దిల్ రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ విజేతలుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1339 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో పోల్ అయిన 891 ఓట్లలో దిల్ రాజు ప్యానెల్‌కు 563, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజుకు ప్యానెల్‌కు చెందినవారే గెలిచారు.


అయితే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌‌లో ఇద్దరికి చేరొక 6, ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లో చెరొక 8 మంది గెలవడంతో ఫలితాలు టై అయ్యాయి. మెజారిటీ సాధించాలంటే అన్ని సెక్టార్లు కలిపి 25 ఓట్లు ఉండాలి. అయితే, తుది ఫలితాల్లో దిల్ రాజ్‌ ప్యానెల్‌లో మొత్తం 24 మంది, సి.కళ్యాణ్ ప్యానెల్‌కు 20 మంది అభ్యర్థులు గెలుపొందారు. దిల్ రాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు 25 ఓట్లు కావాలి. దీంతో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్ణయాన్ని వెల్లడించారు. చివరికి  31 మంది మద్దతుతో దిల్ రాజునే విజేతగా నిలిచి.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.