Kalki 2898 AD: ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై, సినిమాలపై రాజకీయాల ప్రభావం చాలా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి అంతటా హాట్ టాపిక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వైఎస్ జగన్‌ను కాదని చాలామంది సినీ సెలబ్రిటీలు జనసేనకు, టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో మూవీ లవర్స్ అందరికీ కామన్‌గా ఒక డౌట్ కలుగుతోంది. ఒకవేళ వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయితే.. సినీ పరిశ్రమకు ఇబ్బందులు మొదలవుతాయేమో అని. అలా ఆందోళన పడుతున్నవారిలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.


వాయిదా పడినా..


ఇలాంటి ఎన్నికల హీట్ సమయంలో సినిమాలు విడుదల చేయడం మంచిది కాదు అని పెద్ద హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. ముందుగా మేలోనే ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ విడుదల కావాల్సి ఉన్నా.. దానిని కూడా జూన్ 27కు వాయిదా వేశారు మేకర్స్. ఎన్నికలు అయిపోయిన తర్వాతే విడుదల అవుతుంది అని సంతోషపడేలోపు ఈ మూవీ నిర్మాత అశ్విని దత్ గతంలో చేసిన ట్వీట్ ఒకటి ప్రభాస్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. చంద్రబాబుకు సపోర్ట్ చేస్తూ, చంద్రబాబుకు ఓటు వేయమంటూ గతంలో ఓ సందర్భంలో ట్వీట్ చేశారు అశ్విని దత్.


రేపటి కోసం ఓటు..


‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజయం.. రేపటి విద్యార్థుల భవిష్యత్తు కోసం, రేపటి యువత ఉపాధి కోసం, రేపటి రాష్ట్ర అభివృద్ధి కోసం, రేపటి మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, మన తెలుగుదేశం, రేపటి కోసం’ అంటూ ‘రేపటి కోసం ఓటు వేయండి’ అంటూ అశ్విని దత్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ వల్ల ప్రభాస్ ఫ్యాన్స్‌లో కలవరం మొదలయ్యింది. ఎన్నికలు, రిజల్ట్ అవ్వగానే ‘కల్కి 2898 AD’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే.. దీని రిలీజ్ డేట్‌కు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయా అని చర్చలు మొదలయ్యాయి. అశ్విని దత్ గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నా ఇప్పుడు ఆయన ఆ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ‘కల్కి 2898 AD’పై ఎఫెక్ట్ పడుతుందేమోనని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.


ఇప్పటికే ఒకసారి అలా జరిగింది..


వైసీపీ జగన్ పాలనలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది చాలా ఇబ్బందులను ఎదుర్కుంది. అప్పుడు హీరోలంతా ఒక్కటయ్యి స్వయంగా వెళ్లి జగన్‌ను కలిసే వరకు సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు సినీ ప్రపంచంలోని ప్రముఖులంతా దాదాపుగా టీడీపీ కూటమికి, జనసేనకు, పవన్ కళ్యాణ్‌కే మద్దతును ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా కొందరు హీరోలు అయితే ఏకంగా వారి తరపున ప్రచారంలోకి దిగుతున్నారు. సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపే హీరోలతో నిండిపోయింది. ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే మరోసారి ఈ హీరోలు అందరికీ కష్టాలు తప్పవు అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Also Read: దండిగా ‘హీరామండి’ రెమ్యునరేషన్స్, దర్శకుడికి ఎంతిచ్చారో తెలిస్తే షాకే!