Jyotika: పెళ్లికి ముందు హీరోయిన్స్‌గా ఎంతో ఫేమ్ సంపాదించుకున్న నటీమణులు కూడా పెళ్లి తర్వాత ఫ్యామిలీని చూసుకోవడంలో బిజీ అయిపోయి ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ అలాంటివారు కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకరు జ్యోతిక. సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత తన పిల్లలు దియా, దేవ్‌లను చూసుకోవడం, చారిటీ పనుల్లో బిజీగా ఉండడంతో జ్యోతికను మళ్లీ స్క్రీన్ పై చూసే అవకాశం రాలేదు. ఇప్పుడిప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిన జ్యోతిక.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.


పిల్లలు గర్వపడాలి..


‘‘పెళ్లి అనేది మనకు చాలా నేర్పిస్తుంది. ఆ తర్వాత పిల్లలతో సర్దుకుపోవడం మొదలవుతుంది. ఇదంతా ఆడవారి జీవితాల్లో కామన్‌గా జరిగేదే’’ అంటూ పెళ్లి తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు జ్యోతిక. ఇక తన సినిమాలు చూసిన తర్వాత తన పిల్లలు ఎలా ఫీల్ అవుతారు అనే విషయం మాట్లాడుతూ ‘‘వాళ్లు తలెత్తి నా సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. వాళ్లతో పాటు వాళ్ల ఫ్రెండ్స్‌ను కూడా థియేటర్లకు తీసుకొచ్చి సినిమాలు చూస్తారు. మా పిల్లలు మా సినిమాలు చూసినప్పుడు కచ్చితంగా గర్వపడాలి అని నేను, సూర్య అనుకుంటాం’’ అని తెలిపారు. తాజాగా తన కూతురు ‘శ్రీకాంత్’ మూవీని చూసి దాని గురించి అద్భుతంగా మాట్లాడిందని బయటపెట్టారు జ్యోతిక.


మాట వినట్లేదు..


అప్పటి తరం పిల్లలకు, ఇప్పటితరం పిల్లలకు మధ్య ఉన్న తేడాల గురించి కూడా జ్యోతిక మాట్లాడారు. ‘‘అప్పట్లో మనం మన తల్లిదండ్రులు మాట వినేవాళ్లం. ఇప్పుడు కూడా వింటున్నారు కానీ వాళ్లు ఎక్కువగా స్వతంత్ర్యంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వాళ్లకంటూ అభిప్రాయాలు ఉంటున్నాయి. నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. సోషల్ మీడియా వల్ల కూడా బయట ప్రపంచం ఏంటో తెలుస్తుంది. వాళ్లు వేరే తరానికి చెందినవారు కాబట్టి వాళ్లను అర్థం చేసుకొని స్పేస్ ఇవ్వాలి’’ అన్నారు. పెళ్లికి ఫ్రెండ్‌షిప్ అనేది ముఖ్యమని, ముందుగా సూర్య, తాను మంచి ఫ్రెండ్స్ అయిన తర్వాతే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నామని తెలిపారు జ్యోతిక.


భాషతో సంబంధం లేదు..


టాలీవుడ్ గురించి మాట్లాడుతూ పాన్ ఇండియా అనే కల్చర్‌ను ప్రారంభించిందే తెలుగు సినిమా అని వ్యాఖ్యలు చేశారు జ్యోతిక. తాను, సూర్య నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినా డబ్బింగ్ చిత్రాల ద్వారానే తమను చాలా ఆదరించారని చెప్పుకొచ్చారు. చిరంజీవి, రవితేజ వంటి హీరోలతో నటించడం సంతోషంగా అనిపించిందని గుర్తుచేసుకున్నారు. గతేడాది నుంచి తాను పెద్దగా సినిమాలు చూడలేదని, ఎక్కువగా షూటింగ్స్‌లో బిజీగా ఉండడం వల్ల కేవలం వెబ్ సిరీస్‌లు మాత్రమే చూశానని అన్నారు జ్యోతిక. అంతే కాకుండా తెలుగులో మళ్లీ నటించడంపై స్పందిస్తూ తాను ఇప్పుడు స్క్రిప్ట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నానని, అలాగే తెలుగులో మంచి స్క్రిప్ట్ దొరికితే ఇక్కడ కూడా సినిమా చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు.



Also Read: టబుకు హాలీవుడ్ ఆఫర్ - పాపులర్ ఇంగ్లీష్ సిరీస్‌లో ఇండియన్ యాక్ట్రెస్