1993 లో  స్టీవెన్ స్పీల్‌బెర్గ్ దర్శకత్వం లో వచ్చిన జురాసిక్ పార్క్ సినిమా ఓ అద్భుతం . ప్రపంచ  సినిమా చరిత్రలోనే  ఓ క్లాసిక్ సినిమా గా నిలిచిపోయింది . ఆ సినిమాతో  T-రెక్స్ ,వెలోసిరాప్టర్ వంటి డైనోసార్ల పేర్లు కూడా చిన్నపిల్లలకు అలవాటైపోయాయి . 63 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద  ఒక బిలియన్ డాలర్ల పైగా లాభాన్ని నమోదు చేసింది . యానిమాట్రోనిక్  అనే కొత్త పద్దతిలో స్పీల్ బెర్గ్ సృష్టించిన డైనోసార్ల కదలికలు ఎంతో  నేచురల్ గా ఉండడం ,మైకేల్ క్రిచ్  టన్ అందించిన కథ ,ఇప్పటికీ గుర్తిండిపోయిన సిగ్నేచర్ మ్యూజిక్ ,స్పీల్ బెర్గ్ దర్శకత్వ ప్రతిభ ఆ సినిమాను ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేసింది .  సామ్ నీల్ ,లారా డెర్న్ ,జెఫ్ గోల్డ్ బ్లమ్  వంటి నటులను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిందీ సినిమా . అలాగే అంతకు 11 ఏళ్ల  ముందు 1982 లో గాంధీ సినిమా తీసి ఆస్కార్ అవార్డు పొందిన గ్రేట్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్బెరో జురాసిక్ పార్క్ సినిమాలో డైనోసార్ లను సృష్టించే  జాన్ హేమండ్ పాత్ర పోషించడం కూడా జురాసిక్  పార్క్ కు రిలీజ్ కు ముందే భారీ క్రేజ్ ను తెచ్చి పెట్టింది . ఇందులో T -రెక్స్ ఎంట్రీ సీన్ ,గెల్లి మైమస్  డైనోసర్లను T -రెక్స్ వేటాడి తినే సీన్ , చివర్లో హీరోలనూ ,పిల్లలనూ వెలోసిరాప్టర్లు వెంటాడే సీన్లు ఇప్పటికీ టీవీలో వస్తే కళ్లప్పగించి చూసేవారు ఎందరో . 


ది లాస్ట్ వరల్డ్ :జురాసిక్ పార్క్ తో మళ్ళీ హిట్టు కొట్టిన స్పీల్  బెర్గ్ 
జురాసిక్ పార్క్ హిట్ కావడం తో కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ  మైకేల్ క్రిచ్  టన్ అందించిన కథతోనే  1997లో ది లాస్ట్ వరల్డ్ జురాసిక్ పార్క్సినిమాను తెరకెక్కించారు స్పీల్  బెర్గ్ . ఇది మొదటి సినిమా కంటే మరింత డార్క్ థీమ్ తో రూపొందింది . కొంచెం హార్రర్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయి . చేల మధ్య  వెలోసిరాప్టర్ లు మనుష్యులపై దాడి చేసి చంపే సీన్ ,ఒక మనిషిని రెండు T -రెక్స్ లు తినేసే సీన్  వంటివి చాలా భయం గొలిపేలా ఉంటాయి . ఈ సినిమాలో మొదటి పార్ట్ లో నటించిన వాళ్లలో  జెఫ్ గోల్డ్ బ్లమ్  మాత్రమే నటించారు . అటెన్ బెరో నటించినా అది ఒక కేమియో లాంటి పాత్ర మాత్రమే . ఈ సినిమా కూడా పెద్ద హిట్టే అయింది . 73 మిలియన్ డాలర్ల తో తీసిన ఈ సినిమా 618.6 మిలియన్ డాలర్లను ఆర్జించింది . 


స్పీల్  బెర్గ్ తీయని జురాసిక్ పార్క్ 3 -జస్ట్ యావరేజ్  
మళ్ళీ నాలుగేళ్ల తర్వాత  2001 లో జురాసిక్ పార్క్ లోని మూడో భాగాన్ని తెరకెక్కించింది. అటు స్పీల్  బెర్గ్ దర్శకత్వం కానీ .. ఇటు   మైకేల్ క్రిచ్  టన్ కథా సహకారం గానీ లేకుండా తీసిన ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది . మొదటి రెండు సినిమాల స్థాయిని ఏమాత్రం అందుకోలేకపోయింది ఈ సినిమా . కేవలం డబ్బులకోసమే యూనివెర్సల్ పిక్చర్స్ ఈ సినిమా తీసింది తప్ప కథా కథనాలపై దృష్టిపెట్టలేదనే విమర్శలు వచ్చాయి . ఈ సినిమాకు దర్శకత్వం జో జాన్స్టన్ వహించారు . విచిత్రంగా ఈ సినిమా లో మొదటి రెండు సినిమాల్లో నటించిన జెఫ్ గోల్డ్ బ్లమ్ స్థానంలో మళ్ళీ మొదటి పార్టు  నుండి సామ్ నీల్ ను తీసుకొచ్చారు . అలాగే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా T -రెక్స్ ,వెలిసిరాఫ్టర్ ల బదులు కొత్తగా స్పైనో సారస్  ను దించారు . అయినప్పటికీ ఈ సినిమా మొదటి రెండు సినిమాల స్థాయిని అయితే అందుకోలేదు . 93 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా కేవలం 368 మిలియన్ డాలర్ల ను మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు చేసింది . 


15 ఏళ్ల  తర్వాత తెరకెక్కిన నాలుగో చిత్రం -జురాసిక్ వరల్డ్ 
జురాసిక్ పార్క్ 3 యావరేజ్ గా ఆడడం తో మళ్ళీ 15 ఏళ్లపాటు మరో జురాసిక్ పార్క్ సినిమాను తెరకెక్కించే ధైర్యం చెయ్యలేదు నిర్మాతలు . చివరకు 2015 లో కొలిన్ ట్రెవేరో దర్శకత్వం లో జురాసిక్ వరల్డ్ ని తీశారు . కొత్త జెనరేషన్ కు నచ్చే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు . క్రిస్ ప్రాట్ హీరోగా నటించిన ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో భారతీయ నటుడు ఇర్ఫాన్  ఖాన్ నటించాడు . ఇందులో మెయిన్ డైనోసార్ గా హైబ్రిడ్ గా సృష్టించిన ఇండోమినాస్ రెక్స్ ను దించారు . దానితో పాటు ఈ సినిమాలో చూపించిన మోసాసారస్ ఈ సినిమాకు ఎట్రాక్షన్ అని చెప్పాలి .  సినిమా చిన్నా ,పెద్దా అందరినీ ఆకట్టుకోవడం తో పెద్ద హిట్ గా మారింది . 150 మిలియన్ డాలర్ల తో తీసిన ఈ సినిమా ఏకంగా 1.6 బిలియన్ డాలర్లను వసూలు చేసింది .  


దాని సీక్వెలూ హిట్టే 
జురాసిక్ వరల్డ్ హిట్  అందించిన ఉత్సాహంతో 2018 లో జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్ అనే సినిమాను తెరకెక్కించారు . దీనికి జె యే . బయోనా  డైరెక్షన్ వహించగా .. జురాసిక్ వరల్డ్ లో యాక్ట్ చేసిన టీమ్ తో పాటు మొదటి రెండు సినిమాల్లో నటించిన జెఫ్ గోల్డ్ బ్లమ్ చిన్న పాత్రలో కనిపించారు . ఈ సినిమాలో మెయిన్ డైనోసార్ గా ఇండో రాప్ట్రర్ అనే హైబ్రిడ్ డైనోసార్ ను పరిచయం చేసారు . 180 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా 1.3 బిలియన్ డాలర్లను వసూలు చేసి సక్సెస్ కొట్టింది . 


అంచనాలను తలక్రిందులు చేసిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ 
ఐదో పార్టు చివర్లో డైనోసర్లన్నీ మనుష్యుల మధ్యకు వచ్చేసినట్టు చూపడంతో ఇక ఈ సిరీస్ ను కొనసాగించవద్దని విశ్లేషకులు చెబుతూనే ఉన్నా .. నిర్మాతలు మాత్రం జురాసిక్ పార్క్ సిరీస్ లోని ఆరవ సినిమాగా జురాసిక్ వరల్డ్ డొమినియన్ ను రూపొందించారు . జురాసిక్ వరల్డ్ ను తీసిన కొలిన్ ట్రెవెర్రో నే దీనికీ దర్శకత్వం వహించినా సినిమా మాత్రం పూర్తిగా నెగిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది . క్రిస్ ప్రాట్ లాంటి క్రేజ్ ఉన్న హీరోతో పాటు 1993 నాటి  మొదటి సినిమాలో నటించిన హీరో త్రయాన్ని కూడా ఈ సినిమాలో నటింప జేశారు . అయినప్పటికీ సరైన కథనం లేక .. జురాసిక్ సిరీస్ లోనే అత్యంత బోర్ కొట్టించిన సినిమాగా దీన్ని చెబుతున్నారు . జైగాంటో సారస్ తో పాటు థెరిజైనోసారస్ పైరో రాప్టర్ వంటి కొత్త డైనోసర్లను పరిచయం చేసినా మొదటి రెండు సినిమాలు ,4,5 సినిమాల్లోని థ్రిల్లింగ్ సీన్స్ మిస్ అయ్యాయని ,ఇకపై జురాసిక్ పార్క్ సిరీస్ తీయడం  ఆపెయ్యాలని  క్రిటిక్స్ విమర్శలు గుప్పించారు . 185 మిలియన్ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా ప్రస్తుతానికి 439 మిలియన్ డాలర్లను వసూలు చేసింది . కలెక్షన్స్ మాటెలా  ఉన్నా లేని కథను అనవసరంగా పొడిగించారంటూ వస్తున్న విమర్శలు చిత్ర బృందానికి మింగుడు పడడం లేదు . అందుకే నేమో ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఫ్రాంక్ మార్షల్ మాట్లాడుతూ .. ఇప్పట్లో తమకు తదుపరి జురాసిక్ సినిమాలపై ఎలాంటి ఆలోచనా లేదనీ.. కొంతకాలం కూర్చొని అన్నీ గమనిస్తూ ఉంటామని మాత్రమే చెప్పగలమని చెప్పారు . దానితో ఇక జురాసిక్ పార్క్ లేదా జురాసిక్ వరల్డ్ సిరీస్ లనుండి ఇప్పట్లో కొత్త సినిమాలు వచ్చే అవకాశం లేదని హాలీవుడ్ చెబుతోంది .