Jeevitha About Rajashekar: సినిమా పరిశ్రమలో రాజశేఖర్, జీవిత దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. భార్యా భర్తలు ఇలాగే ఉండాలి అనేలా ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత.. తమ ప్రేమ, పెళ్లి గురించి కీలక విషయాలు వెల్లడించారు. “రాజశేఖర్ గారు.. ఎంతో మంది హీరోయిన్లతో కలిసి పని చేసినా, తనకు నా మీద ప్రేమ తగ్గుతుందని భావించలేదు. అలా తను ఎప్పుడూ ప్రవర్తించలేదు. నేను కరెక్టుగా ఉంటే నన్ను వదిలి ఎవరూ వెళ్లరు అనుకుంటాను. ఈ విషయం నా భర్త, పిల్లలు, ఫ్రెండ్స్ విషయంలోనూ వర్తిస్తుంది. నేను వాళ్లను అర్థం చేసుకున్నంత వరకు, వాళ్లకు వేరే అవకాశం ఇవ్వనంత వరకు వాళ్లు వెళ్లరు అనుకుంటాను. ఏ రిలేషన్ షిప్ లో అయినా ప్రాబ్లం వచ్చిందంటే, ఎదుటి వాళ్లకు ఏదో ఒక అవకాశం కల్పించడం వల్లే వస్తుంది. మనం అర్థం చేసుకుని, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి వెళ్తే గొడవలకు తావుండదు. గొడవలకు ప్లేస్ లేనప్పుడు వాళ్లు మనకు దూరం అవుతారనే భయం ఉండదు. నేను అదే నమ్ముతాను. ఇంత వరకూ సక్సెస్ అయ్యాను. నేను ఎప్పుడూ ఇన్ సెక్యూర్ గా ఫీల్ కాలేదు. ఒక అమ్మాయి ఫోన్ చేసి రండి అని చెప్పినా, రాజశేఖర్ ఆ విషయాన్ని నాకు చెప్తారు” అని వెల్లడించారు.


పెళ్లికి ముందే ఒకే రూంలో ఉండేవాళ్లం: జీవిత


పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అని మొదటి నుంచి అనుకున్నట్లు వివరించారు జీవిత. “మేం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. పెళ్లికి మాత్రం ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకోవాలి అనుకున్నాం. పెళ్లికి ముందుకు మేం ఇద్దరం ఒకే రూంలో ఉండేవాళ్లం. ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ కూడా అయ్యాం. చాలా మంది మా గురించి మాట్లాడుకున్నారు. వార్తలు కూడా వచ్చేవి. వాటిని చూసి పేరెంట్స్ బాధపడే వాళ్లు.  మేం పెళ్లి చేసుకున్నా, లేకున్నా, ఇలాగే ఉంటాం అని పేరెంట్స్ కూడా చెప్పాను. ఒకసారి వేరే అమ్మాయితో రాజశేఖర్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. వాళ్ల పేరెంట్స్ కూడా ఒకే చెప్పారు. ఆ అమ్మాయి స్కూల్ లో నాకు సీనియర్. నేను చాలా బాధ పడ్డాను. బాగా ఫీవర్ వచ్చింది. మా అమ్మ రాజశేఖర్ కు ఫోన్ చేసి జీవితకు జ్వరం వచ్చిందని చెప్పింది. తను వెంటనే వచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. నేను క్యూర్ అయ్యాను. సినిమాలు కూడా చేస్తున్నాం. మరోవైపు వాళ్ల పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. నేను మాత్రం మీ పెళ్లి తర్వాత కూడా మీతో మాట్లాడుతానని చెప్పాను. ఇదే విషయాన్ని తను ఆ అమ్మాయికి చెప్పాడు. జీవిత నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటుంది. మా రిలేషన్ షిప్ ఎప్పటి వరకు ఉంటుందో మాకు తెలియదన్నాడు. వాళ్ల పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఆమెను అమెరికాకు పంపించారు. ఆ తర్వాత మేం రెండు మూడు సినిమాలు చేశాం. అప్పుడే తనకు యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్ లోనే ఉన్నాడు. తనకు దగ్గరుండి నేనే సేవలు చేశా. ఆ తర్వాత తనను హాస్పిటల్ నుంచి నేరుగా వాళ్లింటికి తీసుకెళ్లారు. నన్ను కూడా వాళ్లతోనే తీసుకెళ్లారు. తను కోలుకోవడానికి ఏడాది పట్టింది. అప్పుడు పెళ్లి అన్నారు. మా నాన్న చనిపోయారు. ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నాం” అని వివరించారు.


Also Read: సూపర్ స్టార్ కృష్ణ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు - అందుకే ఆయన లెజెండ్!