‘జవాన్‘ అద్భుత విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు పోస్ట్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముంబై  YRF స్టూడియోలో ఈ వేడుక ధూంధాంగా జరిగింది. షారుఖ్ ఖాన్, అట్లీ, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా సహా ‘జవాన్’ చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జవాన్’ చిత్రాన్ని ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు మేకర్స్.


‘జవాన్’ బడ్జెట్ పై అట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు


దర్శకుడు అట్లీ సినిమా బడ్జెట్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా పనులు కరోనా సమయంలోనే మొదలైనట్లు తెలిపారు. తన చిత్రానికి రూ. 30 - 40 కోట్ల బడ్జెట్ కూడా పెట్టడం కషం అని భావిస్తున్న తరుణంలో షారుఖ్ ఖాన్ ఏకంగా రూ. 300 కోట్లు పెట్టేందుకు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. “కోవిడ్ సమయంలో నేను షారుఖ్ సర్ కు జూమ్ కాల్‌లో సినిమా గురించి వివరించాను. ఆ సమయంలో థియేటర్లు ఓపెన్ కాలేదు. జనాలు ఇప్పట్లో థియేటర్లకు వచ్చే అవకాశం కూడా లేదని తెలుసు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. నా సినిమాకు రూ. 30 - 40 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు కూడా ముందుకు వస్తారో? లేదో? అనుకున్నాను. నేనూ నిర్మాతనే కాబట్టి వారి ఇబ్బందులు తెలుసు. కానీ, ఆ సమయంలో  షారూక్ ఖాన్ సర్ ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు ఓకే చెప్పారు. సినిమా పూర్తయ్యే సరికి బడ్జెట్ రూ. 300 కోట్లు దాటిపోయింది. కానీ, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం వమ్ము కాలేదు. ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశారు” అని అట్లీ తెలిపారు.  


Also Read : 2023లో హ్యాట్రిక్ మీద కన్నేసిన షారుఖ్ - క్రిస్మస్ బరిలో 'డుంకీ'


‘జవాన్’లో దీపికా రోల్ ఎలా చేసిందంటే?


ఇక ఈ ఈవెంట్ లో దీపికా పదుకొణెపై షారుఖ్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం ఆమెను ‘పఠాన్’ సినిమా చేస్తున్న సమయంలోనే సంప్రదించినట్లు చెప్పారు. ‘పఠాన్’  బేషరమ్ రంగ్ షూటింగ్ సమయంలో దీపికా పదుకొణెను తన మేనేజర్ పూజా దద్లానీ ఎలా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించిందో వివరించారు. “’పఠాన్’ షూటింగ్ కొనసాగుతోంది.  బేషరమ్ రంగ్ పాట షూట్ అవుతోంది. నేను అక్కడే కూర్చున్నాను. ‘జవాన్’ సినిమాలో తల్లి పాత్ర చేసేందుకు ఒప్పుకుంటుందేమో అడగాలని పూజకు చెప్పాను. విషయం దీపికాకు చెప్పింది. ఆమె పూజ వైపు చూసి తప్పకుండా చేస్తాను. నన్ను షారుఖ్ అడగనివ్వండి అని చెప్పింది. ఆ తర్వాత దీపికా తప్పకుండా చేస్తానని నాతో చెప్పింది. మీరు ఎప్పుడు చెప్పినా వచ్చి చేస్తానని అట్లీకి చెప్పండి అన్నది. ఆమె హృదయం చాలా విశాలమైనది. మేం ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాం. చిన్ని పాత్ర అయినా, తను ఒప్పుకుని చేయడం తన గొప్పతనానికి నిదర్శనం” అంటూ దీపికాపై ప్రశంసలు కురిపించారు.     


అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది.   ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు.  


Read Also: 'రామన్న యూత్' రివ్యూ : అభయ్ బేతిగంటి హీరోగా, దర్శకుడిగా పరిచయమైన సినిమా!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial