బాలీవుడ్‌లో ఏ ఇద్దరూ కలిసి కనిపించినా.. వారు కచ్చితంగా రిలేషన్‌లో ఉన్నారని కొందరు ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలాగే గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి చెందని ఒక వ్యక్తితో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ షికారు చేస్తోంది. దీంతో వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అలాంటి వార్తలు రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. జాన్వీ ఎక్కడికి వెళ్లినా.. ప్రేక్షకులు.. తన బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్న షికార్ పహారియా.. తనతోనే ఉంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే పలుమార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించారు. తాజాగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరుడి గుడిని వీరిద్దరి దర్శించారు. వీరితో పాటు ఒక తమిళ దర్శకుడు కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


దర్శకుడితో పాటు..
జాన్వీ కపూర్‌కు ఎప్పటినుండో దేవాలయాలకు వెళ్లడం చాలా ఇష్టం. అందుకే ఇప్పటికీ చాలాసార్లు తిరుపతికి వస్తూ వెళ్తూ ఉంటుంది ఈ భామ. ఇక తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ గుడికి వెళ్లింది. కానీ తను ఒంటరిగా కాకుండా తన బాయ్‌ఫ్రెండ్ షికార్ పహారియాను కూడా తీసుకెళ్లింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఈ ఫోటోలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘జవాన్’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించాడు అట్లీ. కానీ జాన్వీ, అట్లీ కలిసి ఏ సినిమా చేయలేదు. అయినా వీరిద్దరు కలిసి గుడికి ఎందుకు వెళ్లారు అంటూ నెట్టింట్లో చర్చ మొదలయ్యింది.






తమిళ డెబ్యూకు సిద్ధమా..?
చివరిగా వరుణ్ దావన్‌తో కలిసి ‘బవాల్’ అనే చిత్రంలో నటించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా తన ఎన్‌టీఆర్ సరసన చేస్తున్న ‘దేవర’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమవుతోంది. ఇక అట్లీతో గుడిలో కనిపించడంతో తను దర్శకత్వం వహిస్తున్న తరువాతి సినిమాలో జాన్వీనే హీరోయిన్ అయ్యింటుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ అదే నిజమయితే.. జాన్వీ తమిళ డెబ్యూకు సిద్ధమవుతుందా అని కూడా అప్పుడే చర్చ మొదలయ్యింది. లేదా ‘జవాన్’లాగానే మరో బాలీవుడ్ చిత్రాన్ని అట్లీ డైరెక్ట్ చేయనున్నాడనే అనుమానాలు కూడా ఉన్నాయి.


రోడ్డుపై డ్యాన్సులు..
ఇక జాన్వీ ప్రేమ విషయానికొస్తే.. ఎప్పుడూ తనతోనే కనిపిస్తున్న షికార్ పహారియా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుషీకుమార్ షిండే మనవడు. అయితే దాదాపు గత సంవత్సరం నుంచి జాన్వీ, షికార్ కలిసే కనిపిస్తున్నారు. ముందుగా అంబానీల వినాయక నిమర్జనంలో ముంబాయ్ రోడ్లపై డ్యాన్స్ చేస్తూ కనిపించింది జాన్వీ. అప్పుడు కూడా షికార్ తన పక్కనే ఉన్నాడు. ఇద్దరు కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక తాజాగా తనకు ఎంతో ఇష్టమైన తిరుమలను సందర్శించింది జాన్వీ. అప్పుడు కూడా షికార్.. తన పక్కనే ఉన్నాడు. మరి ఎక్కడ చూసినా కలిసే కనిపిస్తున్న వీరిద్దరి రిలేషన్‌షిప్.. పెళ్లి వరకు వెళుతుందేమో చూడాలి.


Also Read: చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ ఖాన్, విష్ణు విశాల్ - 24 గంటల తర్వాత సాయం!