దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది గార్జియస్ బ్యూటీ జాన్వీ కపూర్. తల్లి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్ గా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో త్వరలోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం 'బవాల్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ కుర్ర భామ.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఆడియన్స్ తమపై కురిపిస్తున్న ప్రేమాభిమానాల గురించి మాట్లాడింది.


నితీష్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బవాల్'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దక్షిణాదిలో తన తల్లి శ్రీదేవి వారసత్వం కారణంగా ఏమైనా భయాందోళనకు గురవుతున్నారా? అక్కడ లభిస్తున్న ప్రేమాభిమానాల గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? అని ప్రశ్నించారు. దీనికి జాన్వీ స్పందిస్తూ సౌత్ ఇండస్ట్రీ తనకు హోమ్‌ కమింగ్‌గా అనిపిస్తోందని, వారి నుంచి తనకు అపారమైన ప్రేమ లభించిందని చెప్పింది.


''నేను 'ధడక్' తర్వాత ఆందోళన చెందడం, భయపడటం మానేశాను. కానీ సౌత్ నుంచి నాకు లభించే ప్రేమ, అక్కడి వారు నన్ను స్వాగతించిన విధానం చూస్తుంటే, నిజంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు అనిపిస్తుంది. నేను సెట్‌ కి వెళ్లినప్పుడు నా ఇంటికి వస్తున్నట్లు అనిపించింది'' అని జాన్వీ కపూర్ తెలిపింది. ఇంతటి ప్రేమ దక్కడానికి తన తల్లి శ్రీదేవి వారసత్వమే ప్రధాన కారణమని, అందుకే వారు తన సొంతవారు అనే భావం కలుగుతోందని జాన్వీ పేర్కొంది. తాను కష్టపడి పనిచేసి, ఆ ప్రేమను తిరిగి ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తానని చెప్పింది.


కాగా, 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. తొలి చిత్రంతోనే యువ హృదయాలను కొల్లగొట్టింది. 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'ఘోస్ట్ స్టోరీస్', 'గుడ్ లక్ జెర్రీ', 'మిలి' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన 'బవాల్' మూవీతో మంచి విజయం అందుకుంది. ఇందులో ఎపిలెప్టిక్ పేషెంట్‌గా జాన్వీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. 


'దేవర' తో టాలీవుడ్ ఎంట్రీ


జాన్వీ ఎప్పటి నుంచో సౌత్ సినిమాల్లో నటించాలనే తన కోరికను పదే పదే వ్యక్తం చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు 'దేవర' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. ఇందులో ఆమె యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. దీని కోసం అమ్మడు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్ మేకా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ 2024 సమ్మర్ లో విడుదల కానుంది.


'దేవర' తో పాటుగా 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి', 'ఉలాఖ్' వంటి సినిమాలలో నటిస్తోంది జాన్వీ కపూర్. అలానే అక్కినేని అఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కమల్ హాసన్ నిర్మాణంలో ఆమె కోలీవుడ్ లో డెబ్యూ చేయనుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా దక్షిణాది నుంచి బాలీవుడ్ కు వెళ్లి తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న శ్రీదేవి కూతురు కావడంతో.. జాన్వీని ఇక్కడి జనాలు బాగా ఓన్ చేసుకున్నారు. మరి సౌత్ లో అమ్మడు ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో వేచి చూడాలి.


Read Also: ఆరేళ్లుగా బిగ్ స్క్రీన్ పై క‌నిపించని ఇద్దరు టాలెంటెడ్ హీరోలు, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial