జేమ్స్ కామెరూన్.. 90వ దశకంలోనే ‘టైటానిక్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి అబ్బుపరిచిన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్. అంతేకాదు.. ‘అవతార్’ వంటి విజువల్ వండర్‌తో ఒక ప్రత్యేక ప్రపంచాన్ని పరిచయం దర్శక దిగ్గజం. ఆయన సినిమా తీస్తున్నారంటే.. అదొక సంచలనం. ఆ మూవీ విడుదలైందంటే.. వరల్డ్ రికార్డులు బద్దలు కావాల్సిందే. మరి, అంతటి పేరున్న దర్శకుడికి ఏం కష్టం వచ్చిందో ఏమిటో తనకు ఎంతో ఇష్టమైన ఎస్టేట్‌ను అమ్మకానికి పెట్టారు. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా? 33 మిలియన్ డాలర్లు.. ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం.. రూ.272 కోట్లు. ఔనండి, మీరు విన్నది నిజమే.


ఎస్టేట్ ప్రత్యేకతలు ఇవే


అమెరికాలోని కాలిఫోర్నియాలో గల హోలిస్టర్ రాంచ్ కమ్యూనిటీ ఆఫ్ గావియోటాలో 102 ఎకరాల్లో కామెరూన్ ఎస్టేట్ ఉంది. సముద్ర తీరానికి సమీపంలో గల ఈ ఎస్టేట్‌లో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బంగ్లా ఉంది. ఇందులో ఐదు విశాలమైన బెడ్ రూమ్‌లు, ఆరు బాత్రూమ్‌లు ఉన్నాయి. అలాగే, 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇవి కాకుండా హెలికాప్టర్, ఇతర వాహనాలను పార్క్ చేసేందుకు వీలుగా 24,000 చదరపు అడుగుల విస్తీర్ణయంలో ఒక పెద్ద గ్యారేజ్ కూడా ఉంది. ఆయన కలెక్ట్ చేసిన కార్లు, ఉపయోగించే హెలికాప్టర్స్ అన్నీ అందులోనే ఉంచుతారట. అలాగే మంచి గ్రీనరీ కలిగిన లాన్‌లు, తాటి చెట్లు, ఒక పెద్ద కొలను.. ఇలా ప్రకృతి అందాల మధ్య ఈ ఎస్టేట్ ఉంది. 


హవాయి రిసార్ట్‌‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది: కామెరూన్ 


కామెరూన్ ఎంతో ఇష్టపడి.. తన అభిరుచికి తగినట్లుగా ఎస్టేట్‌ను డిజైన్ చేసుకున్నారు. ఇక్కడ కూర్చొనే ఆయన సినిమా స్క్రీప్ట్స్‌పై పనిచేస్తారు. ఆహ్లాదాన్ని అందించే వాతావరణంలో పనిచేయడం వల్ల ఒత్తిడి దరిచేరదని కామెరూన్ అంటారు. అంతేకాదు.. ఈ ఎస్టేట్ గురించి చెబుతూ.. ‘‘ఇది హవాయి రిసార్ట్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది’’ అని తెలిపారు. ఈ ఎస్టేట్‌లో ఇంకా జిమ్, సినిమా థియేటర్, రెండు ఆఫీసులు, గేమ్ రూమ్‌లు కూడా ఉన్నాయి. 


ఈ ఎస్టేట్‌ను ముందుగా 1990లో హాలీవుడ్‌కు చెందిన ఓ జంట కొనుగోలు చేశారు. అప్పట్లో దీని ధర 4.3 మిలియన్ డాలర్లు(ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం రూ.35.53 కోట్లు)కు కొనుగోలు చేశారు. అయితే, వారు న్యూజిలాండ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నామనే కారణంతో ఎస్టేట్‌ను కమ్యునిటీకి ఇచ్చేశారు. ఆ తర్వాత కామెరూన్ దాన్ని కొనుగోలు చేసి, తన అభిరుచికి తగినట్లుగా మార్పులు చేయించుకున్నారు. కామెరూన్‌కు సముద్ర జీవితమంటే చాలా ఇష్టం. అందుకే.. ఆయన తన భవనంలోని కిటికీల వద్ద మిలటరీ గ్రేడ్ బైనోక్యులర్లు ఏర్పాటు చేసుకున్నారు. దాని సాయంతో ఆయన ఎస్టేట్ సమీపంలో గల సముద్రంలో తిరిగే గ్రే వేల్స్, హాంప్‌బ్యాక్, సీ ఓట్టెర్స్, సీల్స్, డాల్ఫిన్స్, సీ లయన్స్‌ను చూసి ఆనందించడం ఆయన దినచర్యలో భాగం. అయితే, ఒకే చోట స్థిరంగా ఉండటం కంటే.. అప్పుడప్పుడు మారుతూ కొత్తదనాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతోనే కామెరూన్ ఈ ఎస్టేట్‌ను విక్రయించాలని చూస్తున్నారట.


Also Read: మీకు Project K టీ షర్ట్ ఉచితంగా కావాలా? ఇదిగో ఇలా బుక్ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial