నటి సమంత రూత్ ప్రభు సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారినపడిన ఆమె, మెరుగైన చికిత్స కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ట్రీట్మెంట్ కోసం సామ్ కొన్నాళ్ళ పాటు అమెరికాలో ఉండబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. 


సమంత ఇటీవల తన ఆరోగ్య సమస్య కోసం యునైటెడ్ స్టేట్స్ లోని డాక్టర్లని సంప్రదించిందని నివేదికలు పేర్కొన్నాయి. ట్రీట్మెంట్ కోసం ఆమె కొన్ని నెలల పాటు అక్కడే ఉండాల్సి ఉందని డాక్టర్ సూచించారని, త్వరలోనే అమెరికా వెళ్లనుందని అంటున్నారు. ఎక్కువ కాలం ఉండాల్సి ఉన్నందున ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే సమంత గత కొంతకాలంగా కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ అంగీకరించలేదని, ఇప్పటికే కమిటైన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉందని చెబుతున్నారు. ఆల్రెడీ సైన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ను క్యాన్సిల్ చేసుకుందని, నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి వెనక్కి ఇచ్చేస్తోందనే టాక్ నడుస్తోంది.


Also Read: Naga Shourya Apologies : మీడియాకి సారీ చెప్పిన నాగశౌర్య - స్పూఫ్ ఇంటర్వ్యూపై ఇంకోసారి క్లారిటీ


గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత.. కొంత కాలంగా చికిత్స పొందుతూనే సినిమా షూటింగులు, ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ‘ఖుషి’ చిత్రంతో పాటుగా, 'సిటాడెల్' అనే హిందీ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి కావడమే కాదు, ఖుషీ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అందుకే యేడాది పాటు వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


మయోసైటిస్ కు అవసరమైన అదనపు చికిత్సతో పాటు మనసును ప్రశాంతంగా వుంచుకోవడం కోసం యోగా, మెడిటేషన్ కు పూర్తి సమయం కేటాయించాలని సమంత భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమలోనే ఆమె ఆగస్టు నెలలో అమెరికా వెళ్లనుందట. ఈ చికిత్స కోసం ఆమె కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సామ్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో నూతనోత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.


కాగా, సమంత ఈ ఏడాది సమ్మర్ లో 'శాకుంతలం' సినిమాతో తీవ్ర నిరాశ పరిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రం, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు 'ఖుషి' అనే సినిమాపై ఆశలు పెట్టుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే ఈ రొమాంటిక్ చిత్రంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు జోడీగా కనిపించనుంది. ఇటీవలే రాజమండ్రి, ద్రాక్షారామం పరిసరాల్లో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని 2023 సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


'సిటాడెల్' విషయానికి వస్తే.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో సమంతతో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నారు. ఇది రూసో బ్రదర్స్ అమెరికన్ స్పై సిరీస్‌ కి ఇండియన్ వెర్షన్. దీంట్లో సామ్ ఒక ఏజెంట్ గా కనిపించడమే కాదు, రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేయబోతోంది. దీని కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Also Read: రవీంద్రనాథ్ ఠాగూర్‌గా అనుపమ్ ఖేర్, ఫస్ట్ లుక్‌తో ఆశ్చర్యపరిచిన వర్సటైల్ యాక్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial