సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జైలర్' (Jailer Movie). ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఒక్క తమిళంలో మాత్రమే కాదు... తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే... ఈ టైటిల్ మీద కేరళలో ఓ దర్శకుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలలోకి వెళితే...
మలయాళంలోనూ ఓ 'జైలర్' ఉన్నాడు!
మలయాళ దర్శకుడు షకీర్ మదత్తిల్ 'జైలర్' పేరుతో ఓ సినిమా తీశారు. ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నానని, మూడు నెలల తర్వాత నవంబర్ 6న ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని, ఆ ఏడాది డిసెంబర్ 15కి సినిమా పూర్తి చేసినప్పటికీ ఆర్ధిక పరమైన సమస్యల కారణంగా తన సినిమా విడుదల ఆలస్యమైందని షకీర్ తెలిపారు.
షకీర్ తీసిన 'జైలర్' టైటిల్ విడుదల కార్యక్రమం దుబాయ్‌లోని షార్జాలో జరగ్గా... ఆ వేడుకకు లోక నాయకుడు కమల్ హాసన్, మలయాళ నాయిక మంజూ వారియర్ అతిథులుగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం కంటే పది రోజుల ముందు 'జైలర్' పేరుతో రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సినిమా తీస్తున్నట్లు సన్ పిక్చర్స్ అనౌన్స్ చేసిందని షకీర్ చెబుతున్నారు.
ప్లీజ్... కేరళలో టైటిల్ మార్చండి!
మలయాళ 'జైలర్' టైటిల్ అనౌన్స్ చేయడానికి అంటే ముందు రజనీకాంత్ 'జైలర్' టైటిల్ వెల్లడించినప్పటికీ... తమ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తి అయ్యిందని, దాంతో తాను కేరళ ఫిల్మ్ ఛాంబర్ (Kerala Film Chamber Of Commerce)ను సంప్రదించానని షకీర్ తెలిపారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే...
రజనీకాంత్ 'జైలర్' టైటిల్ రిజిస్ట్రేషన్ సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో జరిగింది. పైగా, రజనీకాంత్ అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆయన సినిమాను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తారు కనుక... అన్ని భాషల్లో ఒక్కటే టైటిల్ ఉండాలని దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. ఆల్రెడీ 'జైలర్' అంటే రజనీ సినిమా అని ప్రేక్షకుల్లో బలమైన ముద్ర పడింది. ఇప్పటికిప్పుడు టైటిల్ చేంజ్ చేయడం అంటే కుదరని పని. అందుకని, మలయాళంలో అయినా సరే టైటిల్ మార్చమని కోరుతూ రజనీకాంత్, కేరళ ఫిల్మ్ ఛాంబర్, 'జైలర్' దర్శక, నిర్మాతలను షకీర్ కోరుతున్నారు.
రజనీకి లేఖ రాసిన షకీర్!
టైటిల్ గురించి రజనీకి లేఖ రాసినట్లు షకీర్ తెలిపారు. కేరళ వరకు ఎటువంటి గందరగోళం లేకుండా... కేరళలో టైటిల్ మార్చమని రిక్వెస్ట్ చేశానని చెప్పారు. మరి, ఈ విషయంలో రజనీకాంత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సన్ పిక్చర్స్ అయితే టైటిల్ చేంజ్ చేయడం కుదరదని పేర్కొన్నట్లు సమాచారం. మొత్తం ఈ వివాదంతో మలయాళ 'జైలర్' గురించి దేశవ్యాప్తంగా తెలిసింది.
Also Read : పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసిన చిరంజీవి - ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషి
మలయాళ చిత్రసీమలో అగ్ర హీరోల్లో ఒకరైన మోహన్ లాల్ 'జైలర్'లో ఓ కీలక పాత్ర చేశారు. అందువల్ల, రజనీకాంత్ 'జైలర్' విడుదలైతే... తమ సినిమాపై ఎఫెక్ట్ ఉంటుందని షకీర్ చెబుతున్నారు. ఇంతకు ముందు టైటిల్ కాంట్రవర్సీలు ఒక్క భాషకు మాత్రమే పరిమితం అయ్యేవి. పాన్ ఇండియా రిలీజ్ కల్చర్ పెరగడంతో సినిమా తీస్తున్న భాషతో పాటు ఇతర భాషల్లో కూడా టైటిల్ గురించి దర్శక, నిర్మాతలు ఆలోచించాల్సి వస్తోంది.
Also Read : ఆలీకి పవన్ కళ్యాణ్ ఝలక్ - స్నేహానికి పూర్తిగా తెగతెంపులు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial