పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ హాస్య నటుడు ఆలీ (Ali) మంచి స్నేహితులు. ఆలీ తన గుండెకాయ అని, ఆలీ లేకుండా తాను సినిమా చేయనని పవన్ చెప్పిన రోజులు ఉన్నాయి. ఇండస్ట్రీ ప్రముఖులు అందరికీ వాళ్ళ స్నేహం గురించి తెలుసు. ఆ స్నేహం ఇప్పుడు లేదని అర్థం అవుతోంది.
జనసేన పార్టీ స్థాపనకు ముందు పవన్ కళ్యాణ్ నటించిన ఒకట్రెండు సినిమాలు మినహా మిగతా అన్నిటిలోనూ ఆలీ ఉన్నారు. సినిమాలకు అతీతంగా వాళ్ళ స్నేహ బంధం బలపడింది. ఆ బంధానికి రాజకీయాలు తూట్లు పొడిచాయని చెప్పుకోవాలి. పరిస్థితులు చూస్తుంటే... ఇప్పుడు శాశ్వతంగా తెగతెంపులు అయినట్లే అనుకోవాలి.
పవన్ కళ్యాణ్ పోస్టులో ఆలీ ఎక్కడ?
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్... తన మొదటి పోస్టులో సినిమా ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ''ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి'' అని ఆయన పేర్కొన్నారు. చివర్లో ''మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాల్ని పంచుకోవాలని ఆశిస్తూ...'' అంటూ ముగించారు.
తన పోస్టులో హీరోలు, దర్శకులు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులతో దిగిన ఫోటోలను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. ఒక్క ఆలీ ఫోటో తప్ప! అవును... పవన్ కళ్యాణ్ పోస్టులో ఆలీ లేరు.
శ్రీనివాసరెడ్డి, ఆది కంటే ఆలీ తక్కువా?
ఆలీని కావాలని పవన్ కళ్యాణ్ విస్మరించారా? పోస్టులో లేకుండా చేశారా? అని సగటు ప్రేక్షకుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే... తక్కువ చేయడం కాదు గానీ, 'భీమ్లా నాయక్'లో ఒక్కటంటే ఒక్క పాటలో ఒక్క సన్నివేశంలో తళుక్కున మెరిసిన 'హైపర్' ఆది ఉన్నారు. అఫ్ కోర్స్... 'జబర్దస్త్'తో కార్యక్రమంతో పాపులరైన ఆది పవన్ వీరాభిమాని. జనసేనలో ఉన్నారు. అందుకని, ఆయనకు చోటు కల్పించారని అనుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ పోస్టులో హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి కూడా ఉన్నారు. జనసేనానితో కలిసి ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఆయనకూ చోటు కల్పించారు. కానీ, ఆలీతో ఉన్న ఫోటోకు మాత్రం చోటు కల్పించలేదు.
ఆలీతో దూరానికి రాజకీయాలు కారణమా?
జనసేన స్థాపన తర్వాత ఇండస్ట్రీ నుంచి పార్టీలో ఎక్కువ మంది చేరలేదు. కానీ, చేరే వ్యక్తుల్లో తప్పకుండా ఆలీ ఉంటారని చాలా మంది భావించారు. అయితే, అలా జరగలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆలీ ఉన్నారు. పైగా, తమ పార్టీ అధినేత ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ మీదకు పోటీకి సిద్ధమని వెల్లడించారు.
Also Read : ప్రభాస్, దీపిక సినిమా టైటిల్ లీక్ - కె మీనింగ్ అదేనా?
ఆలీ పరిచయం చేశారని ఆయన బంధువుకు తాను నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తే... ఆయన ఏమో వైసీపీకి ప్రచారం చేశారని రాజమండ్రిలోని రాజకీయ సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అప్పుడు తన గుండెల్లో పవన్ ఉంటారని చెబుతూ, ఆలీ ఘాటుగా స్పందించారు. వైసీపీలోకి వెళ్లడం తప్పా? అది ఏమైనా నేరమా? అని ఆలీ ప్రశ్నించారు. తనకు ఏ విధంగా సాయపడ్డారని పవన్ కళ్యాణ్ ను అడిగారు. చిరంజీవి వేసిన బాటలో పవన్ వచ్చారని, తన బాటను తానే వేసుకున్నానని ఆలీ తెలిపారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని ఇండస్ట్రీ గుసగుస.
Also Read : బాలకృష్ణ సినిమా హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్
'భీమ్లా నాయక్'లో మౌనికా రెడ్డి నటించారు. ఆవిడ కూడా ఒకానొక సమయంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు. 'భీమ్లా నాయక్' విడుదల సమయంలో ఆ వీడియోలు కొందరు వైరల్ చేయగా... అప్పట్లో చేసిన దానికి సారీ చెప్పారు. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ పోస్టులో ఉన్నారు. ఆలీ లేరు. అందువల్ల, ఆలీతో స్నేహానికి పవన్ కళ్యాణ్ తెగతెంపులు చేసుకున్నట్లేనని చాలా మంది భావిస్తున్నారు. వాళ్ళ మధ్య దూరానికి వైసీపీ కారణమని వ్యాఖ్యానించే జనాలు కూడా ఉన్నారు. అదీ సంగతి! ఏది ఏమైనా... పవన్ కళ్యాణ్ తొలి ఇన్‌స్టా పోస్టులో ఆలీ లేకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial