Bollywood occupies top spot: కరోనా తర్వాత చాలా రంగాల్లో పరిస్థితులు మారిపోయాయి. మారిపోయాయి అనేకంటే.. తారుమారయ్యాయి అనే చెప్పాలి. చాలా రంగాలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కోలుకోలేని స్థితికి పడిపోయాయి. దాంట్లో ఒకటి సినిమా ఇండస్ట్రీ కూడా. కరోనా తర్వాత ఓటీటీలకు అలవాటు పడటం, మంచి మంచి సినిమాలు రిలీజ్‌ కాకపోవడం.. కారణం ఏదైనా సినిమా ఇండస్ట్రీ కొంతమేర డీలా పడిందనే చెప్పాలి. అయితే, 2023 మాత్రం అలా కాదట. ఈ ఏడాది ఇండియన్‌ సినిమా కాలర్‌ ఎగరేసిందని చెప్తున్నారు మూవీ క్రిటిక్స్‌. 2023లో దాదాపు 12000 కోట్లు రాబట్టిందంట సినిమా ఇండస్ట్రీ. అయితే, ఈ షేర్‌లో బాలీవుడ్‌లో టాప్‌లో ఉంటే.. మన తెలుగు ఇండస్ట్రీ సెకెండ్‌ ప్లేస్‌లో ఉంది. 


15 శాతం పెరిగిన కలెక్షన్స్‌


2023 సినిమా ఇండస్ట్రీకి చాలా అనుకూలంగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. 'జవాన్‌', 'పటాన్‌', 'యానిమల్‌', 'గదర్‌ - 2', 'జైలర్‌', 'లియో' సినిమాలు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. దీంతో 2023 ఏడాదికి గాను ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నిలదొక్కుకునేందుకు ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగిపడ్డాయని ఓ ఆర్‌మ్యాక్స్‌ మీడియా ఒక రిపోర్ట్‌ ద్వారా వెల్లడించింది. 2022తో పోలిస్తే.. దాదాపు 15 శాతం కలెక్షన్స్‌ పెరిగాయని, ఇది సినిమా ఇండస్ట్రీకి నిజంగానే మంచి ఏడాది అని ఆ రిపోర్ట్‌లో చెప్పింది. 


టాప్‌లో బాలీవుడ్‌.. సెకెండ్‌ప్లేస్‌లో టీఎఫ్‌ఐ


ఇక ఈ మొత్తం లాభాల్లో బాలీవుడ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. రూ.5,380 కోట్లు ఒక్క బాలీవుడ్‌ నుంచే వచ్చింది. కాగా.. బాలీవుడ్‌ చరిత్రలోనే మొదటిసారి రూ.5000 కోట్ల కలెక్షన్‌ దాటినట్లు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ షారుక్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లాంటి వాళ్లు మంచి కమ్‌బ్యాక్‌ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. అంతేకాకుండా మీడియమ్‌ బడ్జెట్‌ సినిమాలు సైతం ప్రేక్షకులను ఈసారి బాగా ఆకట్టుకున్నాయని సినీ క్రిటిక్స్‌ అభిప్రాయపడ్డారు. 


‘సలార్‌’దే పైచేయి..


ఇక తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ తీసుకుంటే.. ఈ ఏడాది దాదాపు రూ.2300 కోట్లు రాబట్టింది. బడా బడా హీరోల నుంచి రిలీజ్‌ లేకపోయినప్పటికీ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య', ప్రభాస్‌ 'సలార్‌' సినిమాల ద్వారా మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. ఇక దాంట్లో కూడా సలార్‌ మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. అయితే, ఈ ఏడాది ఆదాయం ఇంకా పెరిగే ఛాన్స్‌ ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈసారి పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగానే రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. 


నష్టాల్లో కన్నడ ఇండస్ట్రీ


బాలీవుడ్‌, టాలీవుడ్‌ తర్వాత అత్యధిక లాభాలు కోలీవుడ్‌ ఇండస్ట్రీకి వచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి. కోలీవుడ్‌కి 1960 కోట్లు కలెక్షన్లు వచ్చాయి. అంటే పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 16శాతం పెరిగింది. దాంట్లో కూడా 'లియో', 'జైలర్‌' సినిమాలకే 1300 కోట్లు కలెక్షన్‌ వచ్చింది. ఇక ఆ తర్వాత ప్లేస్‌లో 1139 కోట్ల కలెక్షన్‌తో హాలీవుడ్‌, 572 కోట్ల కలెక్షన్‌తో మాలీవుడ్‌ ఉన్నాయి. ఇక కన్నడ ఇండస్ట్రీలో పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 61 శాతం కలెక్షన్‌ తగ్గిపోయింది.


టికెట్‌ రేట్లు పెంచడం కారణం..


అయితే, ఇంత కలెక్షన్లు పెరిగి.. సినిమా ఇండస్ట్రీ ఈసారి బాగానే ఉన్నప్పటికీ.. ప్యాండమిక్‌కి ముందు ఉన్నంత వృద్ధిలోకి రాలేదని రిపోర్ట్‌ ద్వారా వెల్లడైంది. ఇక టికెట్‌ రేట్లు పెంచడం వల్ల కూడా ఫైనాన్షియల్‌గా బలపడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టార్‌ హీరోలు మంచి మంచి సినిమాలు తీసి, ఎక్కువ సినిమాలు తీస్తే తప్ప పూర్వవైభవం రాదని సూచిస్తున్నారు.


Also Read: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!