ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమ పేరు దేశవ్యాప్తంగా వినబడుతోంది. యశ్ 'కెజియఫ్' రెండు భాగాలు, రిషబ్ శెట్టి 'కాంతార', ప్రభాస్ 'సలార్' సినిమాలతో హోంబలే ఫిల్మ్స్... సుదీప్ 'విక్రాంత్ రోణ', రక్షిత్ శెట్టి '777 చార్లీ', 'సప్త సాగరాలు దాటి' రెండు భాగాలతో కెవిఎన్ ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలు కన్నడ సినిమా గౌరవాన్ని పెంచాయి. అటువంటి పాన్ ఇండియా భారీ సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తోంది ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రుకు చెందిన RC స్టూడియోస్. ఒకే రోజు ఐదు సినిమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'కబ్జ'తో మొదలైన ఆర్.సి. స్టూడియోస్
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ సినిమా 'కబ్జ'. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆర్ చంద్ర దర్శకత్వం వహించిన ఆ సినిమాతో ఆర్.సి. స్టూడియోస్ ప్రారంభమైంది. 'కెజియఫ్' తరహాలో భారీగా తీసిన 'కబ్జ'కు కన్నడలో మంచి ఆదరణ లభించింది. దాంతో పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు చంద్రు.
బెంగళూరులో ఈ రోజే ఐదు సినిమాల ఓపెనింగ్
బెంగళూరులో ఈ రోజు (జనవరి 23వ తేదీ) సాయంత్రం కర్ణాటక ముఖ్యమంత్రి, అగ్ర హీరోలు... అతిరథ మహారథుల సమక్షంలో ఆర్.సి. స్టూడియోస్ ఒకేసారి 5 సినిమాలను ప్రారంభిస్తోంది. బహుశా... భారతీయ చిత్ర పరిశ్రమలో తొలిసారి ఒకే నిర్మాణ సంస్థలో ఒకే రోజు ఐదు సినిమాలను ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు సినిమాలు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: నయా నరేంద్ర మోడీ బయోపిక్ - అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా!
''గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మిస్టర్ ఆనంద్ పండిట్ గారికి చెందిన ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్, ముంబైకి చెందిన లోటస్ డెవలపర్స్ చేతుల మీదుగా ఐదు సినిమాలు ప్రారంభం కానున్నాయి. ఇండియన్ రియల్ స్టార్ శ్రీ ఉపేంద్ర కూడా ఈ శుభ వేడుకకు హాజరు కానున్నారు'' అని ఆర్.సి. స్టూడియోస్ సంస్థ తెలియజేసింది.
సింగపూర్‌లోని ఇన్వెనియో ఆరిజిన్ కంపెనీకి చెందిన మిస్టర్ అలంకార్ పాండియన్, వ్యాపారవేత్త శ్రీ సీకల్ రామచంద్ర గౌడతో కలిసి ఆర్.సి. స్టూడియోస్ ఈ ఐదు సినిమాలు నిర్మించనుంది.
Also Read: హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?
తెలుగులోనూ సినిమా తీసిన చంద్రు
దర్శకుడు ఆర్ చంద్రు తెలుగులో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడలో తాను తీసిన సూపర్ హిట్ సినిమా 'చార్మినార్'ను తెలుగులో సుధీర్ బాబు, నందితా రాజ్ హీరో హీరోయిన్లుగా 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో చంద్రు దర్శకుడిగా పరిచయమైన 'తాజ్ మహల్' సూపర్ హిట్. ఆ సినిమాను అదే పేరుతో తెలుగులో శివాజీ రీమేక్ చేశారు. 'కబ్జ'కు ముందు ఉపేంద్ర హీరోగా తీసిన 'బ్రహ్మ' ఆయనకు భారీ విజయం అందించింది.