Hollywood Movies in Hyd: భాషతో సంబంధం లేకుండా హైదరాబాద్ లో పలు సినిమాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవలే మూడు హాలీవుడ్ బిగ్ మూవీస్ థియేటర్లలో రిలీజై.. సినీ ప్రేమికులను అలరిస్తున్నాయి. వాటిలో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (మిషన్ ఇంపాజిబుల్ 7), ఓపెన్‌హైమర్ , బార్బీ ఉన్నాయి.  


ఈ భారీ చిత్రాలన్నీ కూడా హైదరాబాద్ బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ 7' భారతదేశంలోనే బంపర్ ఓపెనింగ్ సాధించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో చాలా షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ఈ సమయంలోనే 'ఓపెన్‌హైమర్', 'బార్బీ' వచ్చినప్పటికీ 'మిషన్ ఇంపాజిబుల్ 7' మాత్రం ఇప్పటికీ మంచి రన్ ను ప్రదర్శిస్తూ.. తన హవాను కొనసాగిస్తోంది.


తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టోఫర్ నోలన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. 'ఓపెన్‌హైమర్' విడుదలకు ఒక వారం ముందు, నోలన్ మునుపటి చిత్రాలైన 'ఇంటర్‌స్టెల్లార్', 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' కూడా హైదరాబాద్‌లో మళ్లీ విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓపెన్‌హైమర్ ప్రస్తుతం.. హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.


'ఓపెన్‌హైమర్' కి ఇప్పటికే హైదరాబాద్‌లో మంచి స్పందన రాగా.. టికెట్ బుకింగ్‌లు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే 'ఓపెన్‌హైమర్'.. ‘బార్బీ’కి కూడా గట్టి పోటీనిస్తోంది. USA, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ‘బార్బీ’.. 'ఒపెన్‌హైమర్‌'ను అధిగమించింది. కానీ భారతదేశంలో మాత్రం ఇది భిన్నంగా ఉంది. ఇక హైదరాబాద్ నగరంలోనూ ‘బార్బీ’ సాలిడ్ బిజినెస్ చేస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో హాలీవుడ్ సినీ ప్రియులకు ఈ ఏడాది పండగే అని చెప్పవచ్చు.


అమెరికన్ శాస్త్రవేత్త, అణు బాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఓపెన్‌హైమర్' కు మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఇప్పుడీ సినిమా కొత్త చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. మూవీలో భగవద్గీతను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని,  సినిమాను వెంటనే నిషేధించాలని కొంతమంది హిందూవర్గానికి చెందినవారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ నడుస్తోంది.


ఇక అణుబాంబు తయారీకి ముందు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ జీవితంలో ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంది? అణుబాంబు ప్రయోగించిన కొన్నేళ్ళ తర్వాత ఓపెన్ హైమర్ మీద అమెరికా ప్రభుత్వం ఎందుకు ట్రయిల్ చేపట్టింది? అనేది సినిమా స్టోరీగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్ర పోషించారు. వీరితో పాటు మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఎమిలీ బ్లంట్, ఫ్లోరెన్స్ పగ్, రామి మాలెక్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. 


Read Also : Vivek Agnihotri: మగాడివైతే 'మణిపూర్ ఫైల్స్' సినిమా తీయాలన్న నెటిజన్ - కౌంటర్ ఎటాక్ చేసిన 'కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial