Hi Nanna Movie Won 18 International Award: : నాచురల్ స్టార్ నాని గతేడాది రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్నాడు. 2023 ఏడాది ప్రారంభంలో దసరా సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రంతో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టాడు. అదే జోష్‌ అదే ఏడాది చివరిలో 'హాయ్‌ నాన్న' మూవీతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా మంచి క్లాసిక్‌ హిట్‌ అందుకుంది. మరాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.


శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొత్తంగా రూ. 72 పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్‌ వేదికపై సత్తా చాటింది. తాజాగా స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2024 (Swedish International Film Festival 2024) అవార్డుల పంట పండించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటీనటులుగా నాని, మృణాల్ ఠాకూర్‌లు అవార్డు గెలుచుకున్నారు. డైరెక్టర్‌ శౌర్యువ్ రెండు విభాగాల్లో అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్‌ డెబ్యూ అండ్‌ బెస్ట్‌ డైరెక్టర్‌గా రెండు విభాగాల్లో అవార్డులు వరించాయి.






మ్యూజిక్‌ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ రెండు విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ మ్యూజిక్‌ అండ్‌ ఒరిజినల్‌ స్కోర్‌లో విభాగాల్లో రెండు అవార్డులు దక్కాయి. అలా మొత్తంగా 'హాయ్‌ నాన్న' స్వీడిష్ ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆరు విభాగాల్లో అవార్డులు అందుకుంది. తాజాగా మూవీ నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మైంట్స్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించింది.  ఈ అవార్డులతో కలిసి ఇప్పటి వరకు మొత్తంగా ఈ సినిమా 18 ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నట్టు మేకర్స్ వెల్లడించారు. దీంతో మూవీ టీంకి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.  


ఎమోషనల్ జర్నీగా సాగిన 'హాయ్‌ నాన్న' మూవీలో నాని, మృణాల్ ఠాకూర్‌లు తమ నటనతో వందశాతం న్యాయం చేశారు. మృణాల్ అయితే ప్రాణం పెట్టి నటించిందని చెప్పాలి. తల్లికి దూరమైన కూతురి కోసం ఓ తండ్రి పడే తపన, బాధ్యత.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురిని బతికించుకోవడం కోసం ఆ తండ్రి పడే ఆరాటం ఇలా అన్ని ఎమోషన్స్‌ పండించి ఆడియన్స్‌ చేత కన్నీరు పెట్టించాడు. నాని, మృణాల్‌లా ఎమోషనల్‌ రైడ్‌కు సంగీతంతో మరింత ప్రాణం పోశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేశం అబ్దుల్ వహాబ్. అతడి ఇచ్చిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మూవీని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకువెళ్లింది. ఈ సినిమాలోనే పాటలన్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా స్పెషల్‌ శ్రుతి హాసన్‌ స్పెషల్‌ సాంగ్‌ అయితే యూట్యూబ్‌ని షేక్‌ చేసింది. సోషల్‌ మీడియాలో అయితే ఈ పాట మారుమోగింది. ప్రతి ఒక్కరు ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన ఎన్నో రీల్స్‌ నెట్టింట దర్శనం ఇచ్చాయి.