మిళ, తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడు సూర్య. మంచి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు సామాజిక అంశాలతో కూడా మూవీలను చేస్తూ మెప్పిస్తున్నాడు. సూర్య తమిళంలో నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) మూవీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఆ మూవీలో నటనకుగాను సూర్యకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం సూర్య దర్శకుడు సిరుత్తై శివతో యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. 


సూర్య తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి.. చెన్నై నుంచి ముంబయికి మకాం మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ ఆయన రూ.70 కోట్లతో ఓ ఇల్లు కొనుగోలు చేశారని, ఇకపై అక్కడే ఉంటారని తెలిసింది. ఇటీవల సూర్య ముంబైలోని ఓ ఇంటి నుంచి బయటకు వచ్చి హోటళ్లకు వెళ్తున్న కొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సూర్య తొలిసారిగా తన తల్లిదండ్రులను చెన్నైలో వదిలేసి ముంబయిలోనే భార్య, పిల్లలతో ఉంటారంటూ వార్తలు వస్తున్నాయి. 


అయితే, సూర్య ముంబయి వెళ్లడానికి కారణం జ్యోతికనే అని సమాచారం. ప్రస్తుతం జ్యోతిక ఓ హిందీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందుకే, సూర్య ముంబైలో 70 కోట్ల రూపాయలతో కొత్త ఇంటిని కొనుగోలు చేశాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) మూవీ హిందీలో కూడా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సుధా కొంగరా దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతికలే నిర్మిస్తున్నారు. కాబట్టి, ఈ జంట ముంబయిలో ఉండటానికి ఇది కూడా కారణం కావచ్చు. అయితే సూర్య శాశ్వతంగా ముంబైకి షిఫ్ట్ అయ్యారా లేదా కొన్నాళ్ల పాటు అక్కడ స్టే చేసి, మళ్లీ చెన్నై వెళ్లిపోతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


సూర్య తన తల్లిదండ్రులు శివకుమార్, లక్ష్మి, ఆయన తమ్ముడు కార్తీ తదితర కుటుంబ సభ్యులతో గత సంవత్సరాలుగా చెన్నైలో నివసిస్తున్నారు. వారిని వదిలిపెట్టి ముంబయిలో అన్ని రోజులు ఉండటం ఇదే తొలిసారి. సూర్య అభిమానులను కలవరపరుస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 


‘జిగర్తాండా-2’లో సూర్య


కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన ‘జిగర్తాండా’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ అనే సినిమాను కార్తీక్ ప్రకటించాడు. ఇందులో ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ నటించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.


‘జిగర్తాండా’ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయింది. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వరుణ్ తేజ్, అధర్వ ఇందులో హీరోలుగా నటించారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. 2014లో విడుదల అయిన ‘జిగర్తాండా’ అప్పట్లో చాలా అవార్డులు కూడా గెలుచుకుంది. నెగిటివ్ రోల్‌లో కనిపించిన బాబీ సింహాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఈ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సిందని కార్తీక్ సుబ్బరాజ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు.


‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. లిరిక్స్‌ను ప్రముఖ రచయత వివేక్ అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రాఫర్‌గా ఎం.షెరీఫ్ వ్యవహరిస్తున్నారు.


Also Read : సైంధవుడిగా మారుతున్న వెంకటేష్ - రెగ్యులర్ షూటింగుకు రెడీ, ఎప్పట్నించి అంటే?