Hero Ajith Kumar Health Update: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి నిజమే అని కన్ఫర్మ్ అయినా కూడా అసలు ఆయన ఆసుపత్రిలో ఎందుకు చేరారు అనే విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందని, అందుకోసమే ఆసుపత్రిలో చేరారని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ అంతా కంగారుపడ్డారు. బ్రెయిన్ సర్జరీ అంటే మామూలు విషయం కాదని, అసలు అజిత్‌కు ఏమయ్యింది అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. దీంతో అజిత్ కండీషన్ గురించి క్లారిటీ ఇవ్వడం కోసం పబ్లిసిస్ట్ ముందుకొచ్చారు.


వెంటనే సర్జరీ చేశారు..


అజిత్ చెవి నుంచి బ్రెయిన్‌కు కనెక్ట్ అయ్యి ఉన్న ఒక నరం వాపు వల్ల తనకు సర్జరీ జరిగింది. అంతేగానీ ఇది బ్రెయిన్ సర్జరీ కాదు అని అజిత్ పబ్లిసిస్ట్ సురేశ్ చంద్ర క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ప్రస్తుతం అజిత్ పూర్తిగా కోలుకున్నారని త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవుతారని తెలుస్తోంది. ‘‘గురువారం జనరల్ పరీక్షల కోసం అజిత్ ఆసుపత్రిలో చేరారు. అప్పుడే డాక్టర్లు నరాల వాపును గుర్తించారు. దానికి సర్జరీ చేయాలని నిర్ణయించుకున్నారు. చిన్న మెడికల్ ప్రక్రియ ద్వారా సర్జరీ పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఓకే అయ్యారు. ఐసీయూ నుంచి వార్డ్‌కు తనంతట తానుగా నడిచారు’’ అని సురేశ్ చంద్ర ప్రకటించారు.


డిశ్చార్జ్ అవుతారు..


అజిత్ ఈరోజు లేదా రేపు ఆయన డిశ్చార్జ్ అవుతారని సురేశ్ చంద్ర తెలిపారు. దీంతో అజిత్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిందనే రూమర్స్‌పై చెక్ పడింది. ఇక ఒక్కసారిగా అజిత్‌కు ఇలాంటి ఆరోగ్య సమస్య ఏంటి అని ఎదురవుతున్న ప్రశ్నలకు కూడా సురేశ్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం అజిత్.. ‘విడా ముయర్చి’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా.. ఆ మూవీ ఆర్ట్ డైరెక్టర్ అయిన మిలాన్ ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం అజిత్‌ను తీవ్రంగా కలచివేసిందని, అది ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని సురేశ్ చంద్ర క్లారిటీ ఇచ్చారు.


ఆరోగ్యంపై మరింత శ్రద్ధ..


మిలాన్‌ మరణించే ముందు అజిత్.. తనతో ఫోన్‌లో మాట్లాడరని, మరో అరగంటలో కలుద్దామని కూడా అనుకున్నారని సురేశ్ చంద్ర తెలిపారు. అప్పటివరకు తనతో సరదాగా ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా మరణించడంతో ఆరోగ్యంపై మరింత దృష్టిపెట్టాలని అజిత్ నిర్ణయించుకున్నారట. అందుకే ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్‌కు హాజరవుతున్నారని తెలుస్తోంది. అందుకే నరాల వాపు గురించి డాక్టర్లు చెప్పగానే ఆలస్యం చేయకుండా సర్జరీకి ఓకే చెప్పేశారట అజిత్. ఇక ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి పూర్తిగా కోలుకున్న వెంటనే ‘విడా ముయర్చి’ షూటింగ్‌లో పాల్గొంటారు. మజిర్ తిరుమేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అర్జున్ సర్జా, త్రిష, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


Also Read: 96వ ఆస్కార్ వేడుకలను లైవ్‌లో చూడాలని ఉందా? ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?