Gaami Movie Review: ఇప్పటివరకు తనకు వర్కవుట్ అయిన సక్సెస్ ఫార్ములాను ఫాలో అయిన విశ్వక్ సేన్.. మొదటిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ‘గామి’ అనే చిత్రంలో నటించాడు. ఇందులో ఈ యంగ్ హీరో అఘోరగా కనిపించాడు. ఎన్నో ఏళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం.. మార్చి 8న థియేటర్లలో విడుదలయ్యింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతే కాకుండా చాలావరకు ‘గామి’కి ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. కానీ ఎక్కడో మూవీని కొందరు టార్గెట్ చేస్తూ కావాలని నెగిటివిటినీ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


ఫేక్ అకౌంట్స్..


‘బుక్ మై షో’ అనేది సినిమా టికెట్లను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాట్‌ఫార్మ్. కొందరు ప్రేక్షకులు ఈ యాప్‌లో సినిమాకు ఉన్న రివ్యూలను బట్టి కూడా ఆ సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకుంటారు. ప్రస్తుతం ‘గామి’కి కావాలనే కొన్ని ఫేక్ అకౌంట్స్.. 1 స్టార్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. దీన్ని వల్ల బుక్ మై షోలో ఈ సినిమాకు మొత్తంగా 8.3 రేటింగ్ మాత్రమే ఉంది. కేవలం ‘గామి’కి మాత్రమే కాదు.. ఇంతకు ముందు కూడా పలు తెలుగు చిత్రాలకు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయి. కావాలనే బుక్ మై షోలో రేటింగ్‌ను తక్కువగా ఇచ్చి, సినిమాలపై నెగిటివిటీని పెంచి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి ఈ ఫేక్ అకౌంట్స్.


మళ్లీ అదే సమస్య..


విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’, మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’కు కూడా బుక్ మై షోలో ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. ‘గుంటూరు కారం’ విషయంలో అయితే మేకర్స్ దీనిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందుకే చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవాలని అనుకున్నారు. బుక్ మై షోకు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా ఫేక్ అకౌంట్స్ అనేవి పూర్తిగా అంతం కాలేదు. ఇప్పుడు మళ్లీ ‘గామి’ విషయంలో కూడా అదే జరగడంపై కచ్చితంగా బాక్సాఫీస్‌పై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాన్సెప్ట్‌ను నమ్ముకొని ముందుకెళ్తున్న ‘గామి’లాంటి సినిమాలపై ఇలాంటి నెగిటివ్ రివ్యూలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఓవర్సీస్‌లో కూడా..


విధ్యాదర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గామి’లో చాందినీ చౌదరీ హీరోయిన్‌గా నటించింది. కార్తిక్ సబారీష్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అభినయ, మహహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక.. ఇందులో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అంత తక్కువ బడ్జెట్‌తో ఇలాంటి విజువల్స్ అందించడంపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. క్రిటిక్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘గామి’లోని విజువల్స్‌కే ఫుల్ మార్కులు పడుతున్నాయి. అందులోనూ అఘోరగా విశ్వక్ సేన్ యాక్టింగ్ కూడా అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ‘గామి’కి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఇలాంటి ఒక టాలెంటెడ్ టీమ్‌ను ఎంకరేజ్ చేయాలని చాలామంది ప్రేక్షకులు ఆలోచిస్తున్న సమయంలోనే.. బుక్ మై షోలో ఈ సినిమాకు వస్తున్న నెగిటివ్ రివ్యూలు వారిపై ప్రభావం చూపిస్తున్నాయి.


Also Read: తల్లి మీద ప్రేమతో మరోసారి పేరు మార్చుకున్న మెగా హీరో!