Ramoji Rao Usha Kiran Movies: బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు అన్ని మార్పులను చూసి.. దేనికి తగ్గకుండా సినిమాలను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను దక్కించుకుంది ఉషాకిరణ్ మూవీస్. 1983లో రామోజీ రావు స్థాపించిన ఈ ఉషా కిరణ్ మూవీస్.. ఎంతోమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో పాటు ఎన్నో అద్భుతమైన సినిమాలను కూడా నిర్మించారు. ఈతరంలో చాలామందికి ఆయన అందించిన సినిమాల గురించి తెలియకపోయినా.. అప్పట్లో వాటిలో చాలావరకు చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ మూవీతో టాలీవుడ్‌లో ఉషా కిరణ్ మూవీస్ ప్రయాణం మొదలయ్యింది.


ఎన్నో రిస్కులు..


మామూలుగా అప్పట్లో ఏడాదికి ఒక సినిమాను నిర్మించడమే చాలా కష్టం. అలాంటిది 1983లో ఉషా కిరణ్ మూవీస్‌ను స్థాపించిన తర్వాత 1984లోనే బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచారు రామోజీ రావు. అందులో రెండు చిత్రాలు సూపర్ హిట్స్ సాధించాయి. మామూలుగా కొత్త నిర్మాణ సంస్థలు.. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో రిస్క్ తీసుకోవాలని అనుకోరు. అందుకే ఎక్కువగా కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.


కానీ రామోజీ రావు స్థాపించిన ఉషా కిరణ్ మూవీస్ అలా కాదు.. ‘మయూరి’, ‘ప్రతిఘటన’ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించి హిట్ కొట్టింది. ప్రమాదంలో కాలు కోల్పోయిన నృత్యకారిణి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు.. వేరే హీరోయిన్‌ను కాకుండా.. సుధాచంద్రన్‌కే ఆ అవకాశం ఇవ్వడం గమనార్హం. సినీ చరిత్రలో ఇప్పటివరకు అలాంటి ఆ నిర్ణయం మూవీ మేకర్ తీసుకోకపోవడం గమనార్హం. 


రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ లాంటి నటులు అప్పట్లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. ‘మౌన పోరాటం’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆ మూవీకి లభించిన ఆధరణ మరే మూవీకి రాలేదు.


ఇప్పటికీ ఫేవరెట్..


కేవలం తెలుగుకే పరిమితం అవ్వకూడదనే ఉద్దేశ్యంతో స్థాపించిన కొన్నేళ్లలోనే మలయాళం, హిందీ భాషల్లో కూడా ఉషా కిరణ్ మూవీస్.. సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. తెలుగులో తెరకెక్కించిన సినిమాలనే ఇతర భాషల్లో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టారు. 2000 తర్వాత ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు ఇప్పటి యూత్‌కు కూడా ఫేవరెట్‌గా ఉండిపోయాయి. ‘నువ్వే కావాలి’, ‘చిత్రం’, ‘ఆనందం’ వంటి చిత్రాలను ఇప్పటికీ రిపీట్‌లో చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఆ కాలంలోనే ‘చిత్రం’ లాంటి బోల్డ్ సినిమాను నిర్మించి తేజ, ఉదయ్ కిరణ్ లాంటి టాలెంట్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు రామోజీ రావు.


చివరి సినిమా అదే..


2003లో ఒక హిందీ, రెండు కన్నడ, రెండు తెలుగు, ఒక తమిళ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మించి రికార్డ్ సాధించింది ఉషా కిరణ్ మూవీస్. ఆ తర్వాత ఎన్నో కొత్త నిర్మాణ సంస్థలు టాలీవుడ్‌లోకి వచ్చేశాయి. దీంతో పోటీ పెరిగి ఉషా కిరణ్ మూవీస్.. సినిమాలను నిర్మించడంలో వేగం తగ్గించింది. చివరిగా 2015లో రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘దాగుడుమూత దండాకోర్’.. ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన చివరి చిత్రం. 2000లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘నువ్వే కావాలి’ ఏకంగా నేషనల్ అవార్డును అందుకుంది. అంతే కాకుండా ఈ నిర్మాణ సంస్థ ఖాతాలో ఎన్నో నందీ అవార్డులు కూడా ఉన్నాయి. సోషల్ మెసేజ్‌తో ఉషా కిరణ్ మూవీస్ తెరకెక్కించిన చిత్రాలు.. అవార్డుల పంటను పండించాయి.


Also Read: వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన రామోజీరావు జీవితం స్ఫూర్తిదాయకం- ప్రముఖుల ఘన నివాళి