ఆ తరం నటీనటుల గురించి ఈరోజుల్లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ తరతరాలు వరకు గుర్తుండిపోయే నటీనటులు కూడా కొంతమంది ఉంటారు. కారణం ఏదైనా సిల్క్ స్మిత కూడా అలాంటి నటీమణులలో ఒకరు. ఆమె అప్పట్లోనే బోల్డ్ సినిమాలు చేశారు. సౌత్‌‌లో ఐటెమ్ సాంగ్స్ అనేవాటికి క్రేజ్ తీసుకొచ్చారు. తన సినీ జీవితం మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్‌లో కూడా చాలా కాంట్రవర్సీలను ఎదుర్కున్నారు. చిన్న వయసులోనే హీరోయిన్ అయిన సిల్క్ స్మిత.. కొన్నేళ్లలోనే ఎంతో స్టార్‌డమ్‌ను అనుభవించి 35 ఏళ్లకే మరణించారు. అసలు తన మరణం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది అర్థం కాని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఇప్పటికీ సిల్క్ స్మిత మరణం గురించి పలు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. 


మలుపు తిప్పిన ‘వండిచక్కరం’..
1960లో డిసెంబర్ 2న జన్మించారు విజయలక్ష్మి. మామూలుగా విజయలక్ష్మి అని చెప్తే ఇండస్ట్రీలోనే కాదు.. ప్రేక్షకుల్లో కూడా ఎవరూ సరిగా గుర్తుపట్టరు. కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టగలరు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిల్క్.. మలయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించిన సిల్క్ స్మిత.. 1979లో విడుదలయిన తమిళ చిత్రం ‘వండిచక్కరం’తో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నారు. 17 ఏళ్లు ఇండస్ట్రీలో రాణించి.. దాదాపు 450 సినిమాల్లో ఆమె నటిగా, డ్యాన్సర్‌గా కనిపించారు. చివరిగా 1996లో సెప్టెంబర్ 23న ఆమె అనుమానస్పదంగా మృతిచెందారు.


14 ఏళ్లకే పెళ్లి..
సిల్క్ స్మిత.. పేద కుటుంబంలో పుట్టారు. అందుకే తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. పలు కథనాల ప్రకారం తనకు 14 ఏళ్లకే పెళ్లయ్యి.. ఎంతో గృహహింసను కూడా ఎదుర్కున్నారు. అదంతా భరించలేని సిల్క్ స్మిత.. ఇంటి నుండి పారిపోయారు. అలా తన ఫ్రెండ్ అయిన ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లో దాచుకున్నారు. తన ఫ్రెండ్‌తో సినిమా సెట్స్‌కు వెళ్తూ మేకప్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లగా తను కూడా మేకప్ ఆర్టిస్ట్‌గా మారారు. ఆంథనీ ఈస్ట్‌మ్యాన్ అనే దర్శకుడు ముందుకు తనకు సినిమాలో కనిపించే అవకాశాన్ని ఇచ్చాడు. అప్పటినుండి తన జీవితం మారిపోయింది. ఆ తర్వాత విను చక్రవర్తి అనే తమిళ దర్శకుడు తనకు సినిమాల్లో బ్రేక్ ఇచ్చి యాక్టింగ్, డ్యాన్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సహాయపడ్డారు. ఆ తర్వాత మోహన్‌లాల్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టారు సిల్క్ స్మిత.


సూసైడ్ లెటర్ రాసి మరీ..
సినిమాల్లో తన జీవితం బాగానే ఉన్నా.. వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునేవారట సిల్క్ స్మిత. ఆమె ఎవరికీ తెలియకుండా ఒక డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నారని, ఆ తర్వాత అతడు చెప్పింది విని తన సంపాదన అంతా ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పెట్టారని అంటుంటారు. కానీ తన భర్త చెప్పినట్టు విన్న సిల్క్ స్మితకు అదృష్టం కలిసిరాలేదు. పెట్టుబడి పెట్టిన సినిమాలు హిట్ అవ్వలేదు. అలా ఎంతోకాలం ఇబ్బందులు పడిన తర్వాత 1996లో సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్త బయటికి వచ్చింది. తన ఇల్లును సోదా చేయడానికి వెళ్లిన పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికిందని చెప్తుంటారు. తన జీవితంలో తాను సంతోషంగా లేనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా సిల్క్ స్మిత లెటర్‌లో రాసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 


Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial