Captain Miller VS Ayalaan Collections: సంక్రాంతి పండగకు తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా సినిమాల సందడి బాగానే సాగింది. తెలుగులో నాలుగు సినిమాలు విడుదలయినట్టుగానే.. తమిళంలో కూడా రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అయితే.. మరొకటి శివకార్తికేయన్ లీడ్ రోల్ చేసిన ‘అయాలన్’. ఈ రెండు సినిమాలు జనవరి 12న విడుదలయ్యి పోటాపోటీగా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాయి. ఈ మూడు రోజుల్లో ‘కెప్టెన్ మిల్లర్’, ‘అయాలన్’ కలెక్షన్స్ విషయానికొస్తే.. శివకార్తికేయన్ సినిమానే కాస్త ముందుకు దూసుకెళ్తోంది. ‘హనుమాన్’ మూవీ తరహాలోనే ‘అయలాన్’ కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేస్తోంది.
‘కెప్టెన్ మిల్లర్’ వర్సెస్ ‘అయాలన్’..
గతేడాది కూడా తమిళంలో సంక్రాంతికి సినిమాల మధ్య గట్టి పోటీనే జరిగింది. కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన అజిత్, విజయ్ కలిసి తమ చిత్రాలతో సందడి చేశారు. 2023 సంక్రాంతికి ‘వారిసు’, ‘తునివు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే విధంగా ఈ ఏడాది ధనుష్, శివకార్తికేయన్ థియేటర్లలో పోటీకి సిద్ధమయ్యారు. ‘కెప్టెన్ మిల్లర్’కు పోటీగా ‘అయాలన్’ విడుదలయినప్పుడు ‘అయాలన్’కే కలెక్షన్స్ తక్కువగా వస్తాయేమో అని చాలామంది ప్రేక్షకులు ఊహించారు. కానీ సినిమా విడుదలయిన తర్వాత అందరి అంచనాలు తారుమారు అయ్యారు. కలెక్షన్స్ విషయంలో ‘అయాలన్’ ముందంజలో దూసుకుపోతోంది.
‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్..
‘కెప్టెన్ మిల్లర్’ సినిమా మొదటిరోజే రూ.8.80 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అంతే కాకుండా క్రిటిక్స్ దగ్గర నుంచి సైతం పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంది. చూసినవారంతా ఎక్కువశాతం పాజిటివ్ రివ్యూలే ఇచ్చినా కూడా ఎందుకో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వచ్చింది. అలా రెండో రోజు రూ.7.55 కోట్లు, మూడో రోజు ఏకంగా రూ.7.40 కోట్లకు పడిపోయాయి ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్. మొత్తంగా ఇప్పటికీ ఈ మూవీ రూ.23.75 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి వీకెండ్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయని ధనుష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్ రోజురోజుకీ తగ్గుతూ వస్తే.. ‘అయాలన్’ కలెక్షన్స్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూ వచ్చాయి.
‘అయాలన్’ కలెక్షన్స్..
‘అయాలన్’ మూవీ ఏలియన్‌కు, మనిషికి మధ్య ఏర్పడిన ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తెరకెక్కింది. ఈ మూవీ సంక్రాంతికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసింది. ఇక ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రెండోరోజుతో పోలిస్తే.. మూడోరోజు 29.54 శాతం కలెక్షన్స్ ఎక్కువగా పెరిగాయి. విడుదలయిన మొదటిరోజు ‘అయాలన్’ కలెక్షన్స్ కేవలం రూ.3.30 కోట్లు మాత్రమే. ఆ తరువాతి రోజు రూ.4.40 కోట్లు, మరుసటి రోజు రూ.5.70 కోట్ల కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకుపోయింది. మొత్తంగా ఇప్పుడు ‘అయాలన్’ రూ.13.40 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. సినిమా రన్ అంతా పూర్తయ్యే సమయానికి ‘కెప్టెన్ మిల్లర్’ కలెక్షన్స్‌ను టచ్ చేస్తుందని ఇండస్ట్రీ నింపుణులు అంచనా వేస్తున్నారు. ‘అయాలన్’ మూవీని ఆర్ రవికుమార్ డైరెక్ట్ చేయగా.. ‘కెప్టెన్ మిల్లర్’ను అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించారు.
Also Read: పేరులో మార్పు చేసిన ప్రభాస్ - న్యూమరాలజీ ప్రకారం ‘ది రాజా సాబ్’ నుంచి!