Hebah Patel: కెరీర్ మొదట్లో పలు సూపర్ హిట్స్ అందుకొని.. చాలాకాలంగా ఒక హిట్ కోసం ప్రయత్నిస్తున్న హీరోయిన్స్‌లో హెబ్బా పటేల్ ఒకరు. ఇక ఈ భామ చాలాకాలం తర్వాత ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ మూవీలో హీరోయిన్‌గా నటించి మెప్పించడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో బిజీ అయిపోయింది హెబ్బా. అందులోనే తన కెరీర్ గురించి, తను నటించిన సినిమాలు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన వరకు వచ్చి వెళ్లిపోయిన ఆఫర్ల గురించి కూడా మాట్లాడింది. అంతే కాకుండా ‘బేబి’ మూవీ ఆఫర్ ముందు తనకే వచ్చింది అనే రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.


జర్నలిస్ట్ అవ్వాలనుకున్నా..


అసలు హెబ్బా పటేల్ హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదట. తను జర్నలిస్ట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో మాస్ కమ్యూనికేషన్‌లో జాయిన్ అవ్వగానే తనకు మోడల్‌గా అవకాశం వచ్చిందని బయటపెట్టింది హెబ్బా. ముందుగా ఒక తమిళ సినిమాలో తనకు చిన్న పాత్రలో కనిపించే అవకాశం రాగా.. ఆ తర్వాత ఒక తమిళ మూవీతో హీరోయిన్‌గా మారానని వివరించింది. తెలుగులో ‘అలా ఎలా’ అనే సినిమాతో హెబ్బా డెబ్యూ చేసింది. ‘‘అలా ఎలాలో రాహుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి కుమారి 21 ఎఫ్ టీమ్‌కు నా గురించి చెప్పారు. వాళ్లు ఆడిషన్‌కి పిలిస్తే వెళ్లాను. సెలక్ట్ అయ్యాను’’ అంటూ తనకు ‘కుమారి 21 ఎఫ్’ ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది హెబ్బా పటేల్.


దానికే నా ప్రాధాన్యత..


‘కుమారి 21 ఎఫ్’ తర్వాత హెబ్బా పెద్ద స్టార్ అయిపోతుందని ప్రేక్షకులు అనుకున్నారు. అనుకున్నట్టుగానే తనకు చాలా ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ పలు కారణాల వల్ల చాలావరకు సినిమాలు వర్కువట్ అవ్వలేదని బయటపెట్టింది హెబ్బా. ‘కుమారి 21 ఎఫ్’ తర్వాత కొన్నాళ్ల పాటు తను కూడా కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే చేశానని కానీ ‘ఓదెల రైల్వే స్టేషన్’ తర్వాత నుండి తనకు పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన పాత్రలు కూడా వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తను ఎక్కువగా కంటెంట్ ఉన్న చిత్రాలను మాత్రమే చేయడానికి ఇష్టపడుతున్నానని, అందుకే కెరీర్ స్లో అయ్యిందని తెలిపింది. ఎక్కువగా డిఫరెంట్ పాత్రలకే తన ప్రాధాన్యత అని చెప్పింది.


నా వరకు రాలేదు..


తెలుగు ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేశారు కాబట్టి తను కూడా టాలీవుడ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నానని తెలిపింది హెబ్బా పటేల్. తన తర్వాత కెరీర్ ప్రారంభించిన వాళ్లు ఇప్పుడు దూసుకుపోతున్నారు అనే విషయంపై తను స్పందించింది. ‘‘నేను అసలు అలా పోల్చుకోను. ఎవరి జర్నీ వాళ్లది. ఎవరి లక్ వాళ్లది. పోల్చుకుంటూ బాధపడడం ఎందుకు’’ అని తెలిపింది. ‘బేబి’ మూవీ ఆఫర్ ముందుగా తనకు వచ్చిందా అని అడగగా.. ‘‘నాకు ఆ మూవీ ఎవరూ ఆఫర్ చేయలేదు. అలా చాలా సినిమాలు మీకు వచ్చాయి మీరెందుకు చేయలేదు అని అడుగుతుంటారు. కానీ నా వరకు అయితే ఏదీ రాలేదు’’ అని క్లారిటీ ఇచ్చింది హెబ్బా పటేల్. కానీ ‘బేబి’ దర్శకుడు సాయి రాజేష్‌తో అయితే ముందు నుండే పరిచయం ఉందని చెప్పింది.


Also Read: వరుణ్ తేజ్ 'మిస్టర్' మూవీ విషయంలో మాట మార్చిన హెబ్బా - మ్యానేజర్ అలా మాట్లాడొద్దన్నారంటూ ఓపెన్ స్టేట్‌మెంట్