Harshaali Malhotra 10th Results: సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసేవారు ఒకవైపు తమ కెరీర్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు తమ చదువులపై కూడా ఫోకస్ చేయాలి. కానీ రెండిటిలో సక్సెస్ సాధించేవారు చాలా తక్కువమంది ఉంటారు. అందుకే సినిమాల్లో నటిస్తే ఇంక చదువు ఏమైపోతుంది అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. అలాంటి వారికి ‘భజ్‌రంగి భాయ్‌జాన్’లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలి మల్హోత్రా గట్టి సమాధానమే ఇచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘భజ్‌రంగి భాయ్‌జాన్’లో నటించిన హర్షాలి.. ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. తన రిజల్ట్స్ గురించి అందరూ అడుగుతున్నారని ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.


విమర్శలకు చెక్..


సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘భజ్‌రంగి భాయ్‌జాన్’లో మున్ని పాత్రలో నటించి మెప్పించింది హర్షాలి. క్లైమాక్స్‌లో అయితే తన నటనతో ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించే సల్మాన్.. తన రూటును మార్చి ‘భజ్‌రంగి భాయ్‌జాన్’ లాంటి కథను ఎంచుకున్నాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి హర్షాలి కూడా ముఖ్య కారణమే. అలాంటి హర్షాలిని అభిమానించే వారితో పాటు విమర్శించేవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తనను.. ముందు చదువుపై ఫోకస్ చేయమంటూ విమర్శిస్తుంటారు. అలాంటి వారికి హర్షాలి గట్టి సమాధానమే ఇచ్చింది.


అడుగుతున్న వారికోసం..


ప్రస్తుతం హర్షాలి మల్హోత్రా 10వ తరగతి చదువుతోంది. తాజాగా రిజల్ట్స్ రావడంతో పాస్ అయ్యావా లేదా అంటూ ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. వారందరికీ ఒకే పోస్ట్‌తో సమాధానం చెప్పింది హర్షాలి. ‘‘అందరూ నా పరీక్ష ఫలితాలు అడుగుతున్నందుకు థ్యాంక్స్. నేను సీబీఎస్సీ 10వ తరగతిలో 83 శాతం సాధించాను’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేసింది. అంతే కాకుండా తన రిజల్ట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియో కూడా షేర్ చేసింది. ‘‘నా ముద్రలను ప్రాక్టీస్ చేయడం దగ్గర నుంచి చదువుల్లో రాణించేవరకు.. నేను నా కథక్ క్లాసులు, షూటింగ్స్, చదువులను కరెక్ట్‌గా మ్యానేజ్ చేయగలిగాను. రిజల్ట్ ఏమైంది అంటారా.. నాకు 83 శాతం స్కోర్ వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది హర్షాలి.






ఇదే నా సమాధానం..


‘రీల్ వరల్డ్, రియల్ వరల్డ్.. ఇలా రెండు పడవలపై ప్రయాణం చేయడం కష్టమని ఎవరు అన్నారు? నన్ను నమ్మినవాళ్లందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్నవాళ్లందరికీ మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్’ అంటూ తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా బయటపెట్టింది హర్షాలి మల్హోత్రా. సోషల్ మీడియాలో తను యాక్టివ్‌గా ఉండడం చూసి.. ముందు చదువుపై ఫోకస్ చెయ్యి అంటున్న వారందరికీ నా రిజల్టే సమాధానం అని కూడా చెప్పుకొచ్చింది. ‘భజ్‌రంగి భాయ్‌జాన్’ తర్వాత హర్షాలి ఖాతాలో అంత పెద్ద హిట్ ఏమీ లేదు. అయినా ఆ సినిమా తెచ్చిపెట్టిన స్టార్‌డమ్ వల్ల ఎక్కువగా ఫోటోషూట్స్‌లో బిజీ అయిపోయింది ఈ భామ.


Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలీవుడ్ హీరో - 'చందు ఛాంపియన్'లో కార్తీక్ ఆర్యన్‌ను చూశారా?