Nidhi Agerwal Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్‌ కళ్యాణ్ సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇదివరకు ఎన్నడు కనిపించని విధంగా చారిత్రాత్మక యోధుడు పాత్రలో ఆయన కనిపించనున్నారు. పిరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ఫీస్ట్‌గా ఉండబోతుందట. అయితే కొద్ది రోజుల విరామం అనంతరం ఇటీవల హరి హర వీరమల్లు షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. ఆగస్టు 14 నుంచి రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుపకుంటోంది.


ఈ విషయాన్ని మూవీ టీం స్వయంగా ప్రకటించింది. అంతేకాదు ప్రస్తుతం హరి హర వీరమల్లు భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరిస్తున్నామని, ఈ షెడ్యూల్లో 400 నుంచి 500 వరకు ఫైటర్లు, జూనియర్‌ ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుపుతున్నట్టు మూవీ టీం పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇవాళ (ఆగస్టు 17) హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఆమెకు మూవీ టీం విషెస్‌ తెలుపుతూ ఆమె కొత్త లుక్‌ విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో నిధి అగర్వాల్‌ మహాలక్ష్మి దేవి అవతారంలో కనిపించింది. బంగారు చీర, ఒళ్లంతా బంగారు నగలతో అలంకరించుకుని మహారాణిలా మెరుస్తోంది. ఇందులో నిధి తనదైన అందంతో  మాయ చేసేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె కొత్త పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటోంది.






'హరి హర వీరమల్లు' చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్‌ పార్ట్‌ను 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరణ జరుగుతుంది. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ కూడా షూటింగ్‌లో జాయిన్‌ అవుతున్నారని మూవీ టీం పేర్కొంది. కాగా మొదట దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా సట్స్‌పైకి వచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో యువ డైరెక్టర్‌ జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన మరేవరో కాదు నిర్మాత ఎమ్‌ఎమ్‌ రత్నం కుమారుడు.



ఆయన దర్శకత్వం బాధ్యతలు తీసుకున్న అనంతరం రిలీజ్‌ చేసిన టీజర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ నటుడు బాబీ డియోల్, లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్‌తో పాటు నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహీ, సుబ్బరాజ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Also Read: పొరపాటు దిద్దుకున్న 'మిస్టర్‌ బచ్చన్‌' టీం - సినిమా నిడివి తగ్గింపు..