Happy Birtday Mahesh Babu: మహేష్.. ఓ సినిమాలో కలర్స్ స్వాతి చెప్పినట్టు ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. దివంగత నటుడు, హీరో సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. బాలనటుడిగా మెప్పించిన అతడు 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారాడు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు అంటూ ప్రత్యేకమైన క్వాలిటీతో అభిమానుల మనసులు దోచేశాడు ఈ 'టక్కరి దొంగ'. టాలీవుడ్‌లో తండ్రి సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందితే ఎంట్రీతోనే టాలీవుడ్ ప్రిన్స్‌గా ముద్ర వేసుకున్నాడు ఈ 'యువరాజు'. ఐదు పదుల వయసుకు దగ్గర ఉన్న ఇప్పిటికీ ఈ ప్రిన్స్ అమ్మాయిల 'పోకిరి' అనిపించుకుంటున్నాడు.
హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు, హిట్స్‌తో బాక్సాఫీసు వద్ద 'దూకుడు' చూపిస్తున్నాడు. హీరోగానే కాదు మరోవైపు సామాజిక సేవలు చేపడుతూ ఎంతో మంది సాధారణ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ఎంతో మంది చిన్నారులకు ఉచితం సర్జరీ చేస్తూ వారి జీవితాల్లో 'సితమ్మ వాకిట్లో చిరుమల్లె చెట్టు'లా నిలుస్తున్నాడు. కోట్లు ఖర్చు పెట్టి చిన్నారులకు ఫ్రీగా హార్ట్ సర్జరీ చేయిస్తున్న ఈ 'శ్రీమంతుడు' నేటితో 49వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. నేడు ఈ టాలీవుడ్ ప్రిన్స్ బర్త్‌డే. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించిన ఆసక్తికర విషయాలు చూద్దాం!
తెలియకుండానే వెండితెర తెరంగేట్రం
1975 ఆగస్టు 9న మద్రాసులో సూపర్ స్టార్ కృష్ణ-ఇందిర దేవి దంపతులకు జన్మించాడు మహేష్. అప్పటికే ఆయన తండ్రి కృష్ణ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. మహేష్ పుట్టేనాటికే ఆయన 100 సినిమాలు పూర్తి చేసి సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే నాలుగేళ్ల వయసులోనే తనకు తెలియకుండానే బాల నటుడిగా ఆరంగేట్రం చేశాడు మహేష్. ఆయన అన్నయ్య రమేష్ బాబు దాసరి 'నీడ' మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ నేపథ్యంలో ఓ రోజు మహేష్ తన అన్నయ్యతో కలిసి మూవీ సెట్‌కి వెళ్లాడాట. అక్కడ మహేష్‌ని చూసి దాసరి మహేష్‌కు తెలియకుండానే ఓ కీ రోల్ చేయించారట. హీరోగా వెండితెరపై షర్టు విప్పని మహేష్ బాలనటుడిగా తన తొలి చిత్రంలో షర్టు లేకుండా కనిపించడం విశేషం. అలా అనుకోకుండానే సినీరంగ ప్రవేశం చేసిన మహేష్.. ఆ తర్వాత బాలనటుడిగా వరస పెట్టి సినిమాలు చేస్తు వచ్చాడు.
తండ్రికి తగ్గ తనయుడిగా...
అందులో అన్ని కూడా తన తండ్రి కృష్ణతో చేసినవే. తన తండ్రితో కలిసి 'పోరాటం'లో బాలనటుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో తన తండ్రికి పోటాపోటికి డైలాగ్స్ చెప్పి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక వరుసగా బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గుఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం వంటి సినిమాలు చేశాడు. అవన్ని కూడా సూపర్ హిట్ అయ్యాయి. బాలనటుడిగా చివరగా మహేష్ బాలచంద్రుడు మూవీ చేసి ఇక హీరోగా ఎంట్రీ ఇవ్వడమే తరువాయి అని ఫ్యాన్స్ హింట్ ఇచ్చారు.
కొంతకాలం సినిమాలు పక్కన పెట్టి మళ్లీ చదువుపై ఫోకస్ పెట్టాడు. అలా లయోలా డిగ్రీ కాలేజీలో బీకామ్ పూర్తిచేసిన మహేష్ ఇక హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ తెరకెక్కించిన 'రాజకుమారుడు' సినిమాతో మహేశ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మహేష్ సాధించిన రికార్డ్స్ గురించి చెప్పనవసరం లేదు. ప్రాంతీయ సినిమాతోనే విదేశాల్లోనూ రికార్డ్స్ కొల్లగొట్టాడు. ఓవర్సిస్‌లో ఆయన సినిమాలు మిలియన్ల డాలర్లు సాధించాయంటే ఆయన క్రేజ్ ఎంటిదో చెప్పనవసరం లేదు. మహేష్ ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయలేదు.
బాక్సాఫీసు వద్ద తిరుగులేని రికార్డ్స్
ఆయన సినిమాలు ఇతర భాషల్లోనూ విడుదల కాలేదు. కానీ పాన్ ఇండియా రేంజ్‌లో ఆయన సినిమాలు వసూళ్లు సాధించడం విశేషం. ఒక్క తెలుగు భాషలోనే విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో రికార్డులు తిరగరాశారు. అత్యధిక వసూళ్లు చేసిన సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా మహేష్ సినిమాలు పాన్ ఇండియా చిత్రాల సరసన నిలబడటం విశేషం. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న మహేష్ ప్రాంతీయ సినిమాలే చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ తెలుగులోనే విడుదలైంది. కానీ, బాక్సాఫీసు వద్ద ఈ సినిమా రూ. 214 కోట్ల వసూళ్లను సాధించింది.
ఇక 'సరిలేరు నీకెవ్వరు' రూ. 260 కోట్లు, 'మహర్షి' రూ. 170 కోట్లు, 'గుంటూరు కారం' రూ. 200 కోట్లు, 'భరత్ అనే నేను' రూ. 187 కోట్లు కలెక్షన్లు సాధించాయి. అలా పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్న ఈ ప్రిన్స్.. నెక్ట్స్ పాన్ వరల్డ్ సినిమాకు రెడీ అవుతున్నారు. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని కటౌట్ ఉన్న మహేష్‌తో ఎస్‌ఎస్ రాజమౌళి యాక్షన్ అడ్వంచర్ చేయించబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ప్రాంతీయ సినిమాలతోనే నేషనల్ వైడ్‌గా యమ క్రేజ్ సంపాదించుకున్న మహేష్ నెక్ట్స్ పాన్ వరల్డ్ సినిమాతో అతడి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతుందడంలో సందేహం లేదు.
Also Read: నాగచైతన్యతో డేటింగ్, ఎంగేజ్‌మెంట్ - అక్కినేని కొత్త కోడలు శోభిత గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?