HanuMan Team Donation to Ayodhya Ram Mandir: ఈసారి సంక్రాంతికి భారీ బడ్జెట్ స్టార్ హీరోల సినిమాల మధ్య ఒక యంగ్ హీరో మూవీ కూడా విడుదల కానుంది. అదే ‘హనుమాన్’. తమ సినిమా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకోమని ఎన్ని రకాల ఒత్తిడిలు వచ్చినా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అందుకే ‘గుంటూరు కారం’కు పోటీగా జనవరి 12నే ‘హనుమాన్’ విడుదలకు సిద్ధమయ్యింది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి హాజరయ్యారు. అదే సమయంలో ‘హనుమాన్’కు అమ్ముడుపోయే ప్రతీ టికెట్ నుంచి అయోధ్య రాముడికి విరాళం వెళుతుందని కీలక ప్రకటన చేశారు మేకర్స్.


ప్రతీ టికెట్ నుంచి విరాళం..
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా ‘హనుమాన్’ విడుదలకు సిద్ధమయ్యింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటివరకు తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా.. తన ప్రతీ సినిమాకు డిఫరెంట్‌గా ఆలోచిస్తాడని, కంటెంట్‌లో కొత్తదనం చూపిస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అదే విధంగా దేవుడైనా హనుమంతుడిని ఒక సూపర్ మ్యాన్‌గా చూపించి, తన సూపర్ పవర్స్ ఒక మనిషికి వచ్చేలా చేసి, ఆ పవర్స్‌తో ప్రపంచాన్ని కాపాడే ‘హనుమాన్’ కథతో త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ మూవీ హనుమంతుడిపై తెరకెక్కిన కథ కాబట్టి ఈ సినిమా ప్రతీ టికెట్ నుంచి రూ.5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా వెళ్తుందని మేకర్స్ బయటపెట్టారు. ఈ విషయాన్ని విన్న చీఫ్ గెస్ట్ చిరంజీవి వారిని ప్రశంసించారు.


హనుమాన్‌ను మించిన సూపర్ హీరో లేరు..
‘హనుమాన్’ ప్రీ రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయిన చిరంజీవి.. ఈ మూవీ టీమ్ గురించి గొప్పగా మాట్లాడారు. ప్రపంచంలో హనుమాన్‌ను మించిన సూపర్ హీరో లేరని అన్నారు. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రావడం ఆనందంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. హనుమాన్ ట్రైలర్ తనను బాగా ఆకట్టుకుందని, ట్రైలర్ చూసిన వెంటనే ప్రశాంత్ వర్మ గురించి తెలుసుకున్నానని తెలిపారు. ఈ మూవీ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు చిరంజీవి. ఒక టికెట్ రేట్ నుంచి అయోధ్య రామ మందిరానికి విరాళం ఇవ్వాలని ‘హనుమాన్’ మేకర్స్ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుతూ.. అది చాలా మంచి విషయమని అన్నారు.


హనుమంతుడు ఎవరు..?
జనవరి 12న విడుదల కానున్న ‘హనుమాన్’లో తేజ సజ్జాకు జోడీగా అమృత అయ్యర్ నటించింది. ఇక హీరోకు అక్క పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపించనుంది. విలన్‌గా వినయ్ రాయ్ నటించాడు. అయితే సినిమాలో కీలక పాత్ర అయిన హనుమంతుడిగా ఎవరు కనిపించనున్నారు అనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. హనుమంతుడిగా చిరంజీవి నటిస్తే బాగుంటుందని భావించినా ఆ రిక్వెస్ట్‌ను ఆయన రిజెక్ట్ చేశారని ప్రశాంత్ వర్మ ఇప్పటికే బయటపెట్టాడు. అయినా కూడా ట్రైలర్‌లోని చివరి షాట్ చూస్తుంటే అవి చిరంజీవి కళ్లలాగానే ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఇది ఏఐతో చేసిన ఫోటో అని వాదిస్తున్నారు.


Also Read: ఆడవారిని షూ నాకమని అడిగే సినిమాలను ప్రోత్సహిస్తోంది వాళ్లే - ‘యానిమల్’ మూవీపై కంగనా ఫైర్