Prasanth Varma: బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ఫోటో షూట్ కూడా నిర్వహించారు. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్తుందని భావిస్తున్న తరుణంలో ఈ చిత్రం నుంచి రణవీర్ తప్పుకున్నాడని రూమర్స్ వచ్చాయి. దర్శక హీరోల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే దీనికి కారణమని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ ఇంటర్వూలో ఈ విషయం మీద నోరు విప్పారు. 


రణ్‌వీర్‌ సింగ్‌తో విభేదాలపై దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అతను తన మొత్తం కారవాన్ తో తనను కలవడానికి ఆఫీస్ కు వచ్చాడని, లుక్ టెస్ట్ కూడా జరిగిందని ధృవీకరించాడు. “అవును, రణవీర్ సింగ్ తన స్టైల్ లో మొత్తం కారవాన్‌తో ఆఫీసుకు వచ్చాడు. కానీ, దక్షిణాదిలో పని తీరు వేరుగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఒక జట్టుగా పని చేస్తారు. ఎవ్వరూ ఎవరిపైనా ఎలాంటి అధికారాన్ని చేలాయించడానికి ప్రయత్నించరు” అని ప్రశాంత్ అన్నారు.


రణవీర్ సింగ్ తో క్రియేటివ్ డిఫరెన్స్, ఫోటో షూట్ కోసం ఎక్కువ టైమ్ తీసుకున్నారనే వార్తల గురించి కూడా ప్రశాంత్ వర్మ మాట్లాడారు. “నేను అరగంట పాటు షూట్ చేయడానికి 3-4 రోజులు తీసుకుంటాననే చర్చ నిరాధారమైనది. మేము అతని లుక్ టెస్ట్ ను సమర్థవంతంగా పూర్తి చేసాము. ఈ పుకార్లు ఎలా పుట్టుకొచ్చాయో నాకు ఖచ్చితంగా తెలియదు. అలాంటి వాటిని నేను పట్టించుకోను" అని దర్శకుడు చెప్పుకొచ్చారు.


నిజానికి 'హను-మాన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, దానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని ప్రకటించారు ప్రశాంత్ వర్మ. 2025లో రిలీజ్ చేసే విధంగా అన్నీ ప్లాన్ చేసుకున్నారు. అంతలోనే రణవీర్ సింగ్ కు నేరేట్ చేసిన స్టోరీ నచ్చడంతో, వెంటనే ఆయనతో వర్క్ చేయడానికి పచ్చ జెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫొటో షూట్ కూడా నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి 'రాక్షస్', 'బ్రహ్మ రాక్షస్' వంటి టైటిల్స్ కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా రణవీర్, ప్రశాంత్ కలిసి పని చేయడం లేదని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ రూమర్స్ ను చిత్ర బృందం ఖండించింది. 


"రణ్‌వీర్‌ సింగ్‌, ప్రశాంత్‌ వర్మ కాంబో క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల రద్దయిందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని రూపొందించనుంది. ఇటీవల ఫోటో, ప్రోమో షూట్ కూడా పూర్తయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని చిత్ర బృందం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన తాజా ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ పై స్పందించారు. వర్క్ విషయంలో రణబీర్ తో సృజనాత్మక విభేదాలు వచ్చాయనుకునే విధంగా మాట్లాడారు. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, రణవీర్ తన కార్వాన్ తో సెట్స్‌ లోకి వచ్చినప్పుడు అతని పర్సనల్ టీం ప్రవర్తన ప్రశాంత్ వర్మకి ఇబ్బందిగా అనిపించిందని తెలుస్తోంది. 


'రాక్షస్' అనేది 'హనుమాన్‌' తరహాలోనే తెరకెక్కే మైథలాజికల్‌ టచ్‌ ఉన్న పిరియాడికల్‌ డ్రామా అనే టాక్‌ ఉంది. దీంట్లో రణ్‍వీర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందని అంటున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని రూపొందిస్తారట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Also Read: మైత్రీ చేతికి కాజల్, ఆనంద్ దేవరకొండ సినిమాలు - చిన్న చిత్రాలకు సపోర్ట్ గా అగ్ర నిర్మాతలు!