క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తీసిన 'గులాబీ'తో పాటు ఆయన గురువు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అనగనగా ఒక రోజు', ఇంకా మరెన్నో సూపర్ హిట్ సినిమాలకు రచయితగా, మాటల రచయితగా పని చేసిన నడిమింటి నరసింగ రావు ఇకలేరు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.


నడిమింటి నరసింగ రావు వయసు 72 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ ప్రాంతంలోని యశోదా ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే, ఆరోగ్య పరిస్థితి మెరుగు కాలేదు. పైగా, మరింత క్షీణించడంతో పాటు వారం రోజుల క్రితం కోమాలోకి వెళ్లారు. ఈ రోజు శాశ్వతంగా కన్ను మూశారు. ఆయన మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నడిమింటి నరసింగ రావుకు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులకు చిత్రసీమ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.


నాటకాల నుంచి సినిమాల్లోకి వయా టీవీ!
'గులాబీ', 'అనగనగా ఒక రోజు'తో పాటు 'పాత బస్తీ', 'ఊరికి మొనగాడు', 'కుచ్చి కుచ్చి కూనమ్మా' వంటి చిత్రాలకూ ఆయన మాటల రచయితగా పని చేశారు. తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టక ముందు నాటక రంగంలో నడిమింటి నరసింగ రావు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'బొమ్మలాట' అనే నాటకం ఆయనకు విశేష గుర్తింపు తెచ్చింది.






నాటక రంగం నుంచి టీవీ పరిశ్రమలో ప్రవేశించారు నడిమింటి. దూరదర్శన్ టీవీ ఛానల్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన 'తెనాలి రామకృష్ణ' సీరియల్‌ మాటల  రచయిత ఆయనే. 'ఈ టీవీ'లో అత్యంత ప్రాచుర్యం పొందిన 'వండర్ బోయ్', 'లేడీ డిటెక్టివ్', 'అంతరంగాలు' వంటి సీరియళ్లకు కూడా నడిమింటి నరసింగ రావు మాటలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, టీవీ పరిశ్రమ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు



నడిమింటి మాటల కోసం సినిమాలు, సీరియళ్లు చూసిన జనాలు!
'గులాబీ', 'అనగనగా ఒక రోజు' సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయి? ఏ స్థాయి బ్లాక్ బస్టర్స్? అనేది ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయా సినిమాల్లో మాటలు కూడా విశేష ఆదరణ పొందాయి. ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఆ డైలాగ్స్ కోసమే సినిమాలు చూసిన జనాలు చాలా మంది ఉన్నారు.


Also Readకంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే